
- ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది
- గతంలో అదానీని తిట్టినోళ్లు.. ఇప్పుడెట్ల దోస్తీ చేస్తున్నరు?
- రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్‌కు అప్పగించామని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజలు తిరగబడతారని బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. ‘‘కొత్త ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఎరువుల కోసం మళ్లీ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి, పోలీస్స్టేషన్లలో ఎరువులు అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విషయాలనే ప్రజలకు చెబుతున్నాం” అని అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబ్నగర్లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. ‘‘డిసెంబర్9న కాంగ్రెస్ప్రభుత్వం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పారు. కానీ ఇంతవరకు రుణాలు మాఫీ చేయలేదు. ఎవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దు.. డిసెంబర్లో సోనియాగాంధీ కడతారని చెప్పారు. రైతుబంధు రూ.10 వేలు కాదు రూ.15 వేలు ఇస్తామన్నారు. పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నాం” అని అన్నారు.
‘‘పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని చెప్పిన కాంగ్రెస్.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం తర్వాత ఆ హామీ సాధ్యం కాదని చేతులెత్తేసింది. కర్నాటకలోని అప్పర్‌భద్రకు జాతీయ హోదా ఇస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌నేతలు కనీసం ప్రశ్నించలేదు. ప్రియాంకగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తే, అసలు అలాంటి హామీనే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చారు” అని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ప్రభుత్వం హామీలు ఎగ్గొట్టేందుకు శ్వేతపత్రాల పేరుతో నాటకాలు మొదలుపెట్టింది. అందుకే పదేండ్ల పాటు కష్టపడి చేసిన అభివృద్ధిని, సృష్టించిన ఆస్తులను స్వేదపత్రం రూపంలో ప్రకటించాం. మేం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించాం. బంగారు పల్లెంలో పెట్టి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు అప్పగించాం” అని అన్నారు.
అదానీతో ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ
గతంలో అదానీని తిట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడెట్ల ఆయనతో దోస్తీ చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘మోదీ, అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ అంటారు. అదానీ దోచుకున్న రూ.13 లక్షల కోట్లు ప్రధాని మోదీకి, బీజేపీకి చేరుతాయని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా అడ్డగోలుగా మాట్లాడారు. మరి ఇప్పుడేమో దావోస్సాక్షిగా అదానీని రేవంత్అలయ్ బలయ్ చేసుకున్నారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతున్నామని చెప్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు. అదానీ విషయంలో తమ పార్టీ వైఖరేంటో కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఓడించాలని, బొందపెట్టాలని బీజేపీ నేత బండి సంజయ్అన్నారు. బీజేపీ ఆదేశాలతోనే తెలంగాణ సీఎం పని చేస్తున్నారు” అని ఆరోపించారు.
పథకాలపై ప్రజలకు చెప్పుకోలేకపోయాం..
అనేక సంక్షేమ పథకాలు అందించినా, వాటిని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కన్నా బీఆర్ఎస్కు 4 లక్షల ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నది. అందరం కలిసికట్టుగా పని చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కష్టమేమీ కాదు” అని అన్నారు. ‘‘సంక్షేమ పథకాల్లో అక్రమాలకు తావులేకుండా చూడాలనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూశాం. ఇందులో కార్యకర్తల ప్రమేయం లేకపోవడంతో ఆయా పథకాలు ఇచ్చింది బీఆర్ఎస్అనే విషయాన్ని చెప్పుకోలేకపోయాం” అని పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా ప్రజల కోసమే పని చేస్తామన్నారు. పార్టీలో గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేస్తామని, అన్ని అంశాలపై కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీలు ఇంకా యాక్టివ్కావాలె
బీఆర్ఎస్ఎమ్మెల్సీలు ఇంకా యాక్టివ్కావాలని ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్సూచించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కళ్లు, చెవుల మాదిరిగా పని చేయాలని కోరారు. ఇప్పటికే ఆప్ట్చేసుకున్న తమ నియోజకవర్గాల్లోని పార్టీ క్యాడర్‌తో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట ఎమ్మెల్సీలే క్రియాశీలకంగా పని చేయాలన్నారు. గురువారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్సీలతో కేటీఆర్ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పని చేయాలని కోరారు. ఈ ఏడాది మొత్తం వరుస ఎన్నికలున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.