తెలంగాణ సహా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో కనుమరుగయింది : ప్రధాని మోడీ

తెలంగాణ సహా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో కనుమరుగయింది :  ప్రధాని మోడీ

హిమాచల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ

సిమ్లా: అభివృద్ధికి కాంగ్రెస్ శత్రువని, అస్థిరతకు, అవినీతికి కేరాఫ్​ అడ్రస్​ అని ప్రధాని నరేంద్ర మోడీ ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్​లోని కాంగ్రా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. హిమాచల్​కు స్థిరమైన, బలమైన డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని అన్నారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. దేశం మొత్తమ్మీద రాజస్థాన్, చత్తీస్​గఢ్ లలో మాత్రమే కాంగ్రెస్​ ఉనికిలో ఉందని ప్రధాని చెప్పారు. తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ కనుమరుగయిందని చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​లో అంతర్గత కుమ్ములాటలే మిగిలాయన్నారు. సుపరిపాలన, పేదలకు అనుకూలమైన విధానాలతో బీజేపీని ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకే తమ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తోందని చెప్పారు. బీజేపీ తాను చేయగలిగిందే చెప్తుందని, ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిమాచల్​కు ద్రోహం చేసిందని విమర్శించారు. తాను ప్రధాని అయ్యాక కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించిందని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఏనాటికీ అభివృద్ధిని కోరుకోరన్నారు. ఆర్మీ చీఫ్‌‌ను అవమానించారని, సైనికులను గూండాలతో పోల్చారని ఆరోపించారు. సర్జికల్ స్ట్రయిక్స్‌‌పైనా సందేహాలు లేవనెత్తారని మండిపడ్డారు.

అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపారు

కాంగ్రా జిల్లాలో ప్రచారంలో పొల్గొనేందుకు వెళ్తుండగా ఓ అంబులెన్స్ అటువైపుగా రావడంతో తన కాన్వాయ్​ని మోడీ ఆపారు. అంబులెన్స్ వెళ్లిపోయాక తిరిగి బయల్దేరారు. ‘ప్రజల ప్రధాని’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయింది.