హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ఒక ప్రాసెస్ ఉంటుందని, సరైన టైమ్‌లో అభ్యర్థులను హైకమాండ్ ప్రకటిస్తుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ కోసం తమ పార్టీ నుంచి తాను, మల్లు రవి సహా 26 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారని తెలిపారు. ఆశావహుల లిస్ట్ లో తాను కూడా ఉన్నానని మల్లు రవి చెప్పారని ఆయన గుర్తుచేశారు. నాగర్‌కర్నూలులో బీఆర్ఎస్ మీటింగ్ కు ఎంపీ రాములును పిలవకపోవటంపై ఆయన స్పందిస్తూ.. బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది అవమానాలు ఎదుర్కొన్నారని, ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు.
కేటీఆర్ ఇంకోసారి పాలమూరుకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తల సమాధానం వేరే విధంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. సీఎం అభ్యర్థిగా రేవంత్ ను ముందే ప్రకటిస్తే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కూడా ఓడిపోయే వారని అన్నారు. పదేండ్లు కేటీఆర్ యువరాజులా కొనసాగి, విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీ చేశాడని ఆయన ఆరోపించారు. ఎవరు బుడ్డరఖానో, ఎవరు తీస్మార్ఖానో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్ల రూపంలో తీర్పు చెప్పారని సంపత్ గుర్తుచేశారు. కేటీఆర్ ను ఎవరు పిలవటం లేదని, అందుకే పబ్లిక్ పిలిస్తే అంతరిక్షం నుంచి కూడా వస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంకో 24 ఏండ్లు అయినా వారి కారు సర్వీసింగ్ షెడ్ నుంచి బయటకు రాదని సంపత్ పేర్కొన్నారు.

