మన టార్గెట్2029 ఎలక్షన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి: సీఎం, మంత్రులు, ముఖ్యనేతలకు హైకమాండ్ దిశానిర్దేశం

మన టార్గెట్2029 ఎలక్షన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ను మరింత కట్టడి చేయండి: సీఎం, మంత్రులు, ముఖ్యనేతలకు హైకమాండ్ దిశానిర్దేశం
  • ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయంతో నడపండి
  • అర్హులందరికీ పథకాలు అందాలి.. ప్రజలకు మరింత చేరువ కావాలి
  • సీఎం, మంత్రులు, ముఖ్యనేతలకు హైకమాండ్ దిశానిర్దేశం
  • ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​తో ఢిల్లీలో కీలక భేటీ
  • రెండేండ్ల ప్రభుత్వ, పార్టీ పని తీరుపై సంతృప్తి
  • పంచాయతీ, మున్సిపల్​ ఎన్నికల ఫలితాలపై కితాబు
  • ఈ టీమ్​వర్క్ బాగుందని ప్రశంసలు

న్యూఢిల్లీ, వెలుగు: 2029లో జరగనున్న లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా ముందుకు సాగాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను మరింత కట్టడి చేయాలని చెప్పింది. ఇందుకోసం ప్రభుత్వాన్ని, పార్టీని మరింత సమన్వయంతో నడపాలని సూచనలు చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ దిశలో అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నది. 

గురువారం రాష్ట్ర ముఖ్యనేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో భేటీ అయ్యారు. రాజాజీ మార్గ్​లోని ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహా, అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ నేత వంశీ చంద్​ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు రెండున్నర గంటలు సాగిన ఈ భేటీలో ప్రభుత్వ, పార్టీ పనితీరుపై చర్చించారు. 
ముందుగా తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతున్న తీరు, అందుకు తగ్గట్లుగా ఎన్నికల్లో సాధిస్తున్న విజయాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ ఎన్నికలు మొద లుకొని తాజా మున్సిపల్ ఎన్నికల వరకు అన్ని ఎన్నికల ఫలితాలను గణాంకాలతో పాటు వివరిం చారు. ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరును వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పార్టీ గ్రాఫ్ పెరిగిన తీరుపై రిపోర్ట్ అందజేశారు. అంతేకాకుం డా పాలన సౌలభ్యం దిశగా గ్రేటర్​ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం, మూసీ నది ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, పెట్టుబడులు ఆకర్షించే దిశలో రూపొందించిన తెలంగాణ విజన్ అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమిష్టిగా పనిచేశామని మంత్రులు వివరించారు. ప్రభుత్వంలో మంత్రులుగా తమకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చి మద్దతుగా ఉంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పాలనపై ఖర్గే, రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీమ్​వర్క్​ను  ప్రతిబింబించాయని కితాబిచ్చారు.
ఆ పార్టీల ఎత్తుగడలకు చెక్
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​పై విశ్వాసంతో ఉన్నారని తాజా ఫలితాల ద్వారా వెల్లడైందని హైకమాండ్ స్పష్టం చేసింది. ప్రజలకు చేరువైతేనే పార్టీకి మరింత మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపింది. అయితే, ఇదే సందర్భంలో బీఆర్ఎస్, బీజేపీని మరింత కట్టడి చేయాలని అగ్రనేతలు సూచించారు. ఎప్ప టికప్పుడు ఆ పార్టీల ఎత్తుగడులకు చెక్ పెడుతూ.. వారి విస్తరణ ప్రయత్నాలను నిలువరించాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అలాగే, మతతత్వాన్ని జొప్పించి బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని సూచించారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, మతతత్వ, విభజించు పాలించు వ్యూహాలను బలం గా తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. ఇందుకోసం అవసరమైతే పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వం ఫైట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో దక్షిణాదిలో పార్టీకి బలం ఉందని.. ముఖ్యంగా తెలంగాణలో ఈ పట్టు కోల్పోకుండా స్థిరంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలకు దక్షిణాదే కాంగ్రెస్​కు బలమని, సాధ్యమైనంత మేరకు ప్రజలతో మమేకం కావాలని సూచించారు.  

శాఖల వారీగా ఆరా

సుదీర్ఘ భేటీలో ఖర్గే, రాహుల్ గాంధీ శాఖల వారీగా స్కీమ్​ల పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. అన్ని శాఖల మంత్రులతోనూ అగ్రనేతలు కొంతసేపు ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఆయా శాఖల్లో తాజా పరిస్థితులు, ప్రజలకు చేరువయ్యేలా తీసుకుంటున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలు/గిరిజనులు, దళితులు, గిగ్ వర్కర్లలకు సంబంధించిన అంశాలు తెలుసుకునేందుకు రాహుల్ ఆసక్తి చూపారు. 

తాజాగా జరిగిన మేడారం జాతర గొప్ప తనాన్ని మంత్రి సీతక్కను అడిగి మరి రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  సమ్మక్క జాతర నిర్వహణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిపారు. ఈ వన దేవతల ప్రాశస్త్యంపై నేషనల్ లెవల్ మూవీ తీస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అలాగే.. తెలంగాణలో ధాన్యం సేకరణ ఇతర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. మరోవైపు వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు తెలి పారు. ఈ ఫలితాలు ఉత్తమమే అయినా.. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నంబర్ వన్​గా తెలంగాణ ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. కొన్ని ఇతర అంశాలపై సమావేశంలో అందరి ముందూ కాకుండా విడివిడిగా మాట్లాడుతానన్నారు.

మరింత టీమ్ వర్క్ అవసరం

తాజా ఎన్నికల ఫలితాలతో సంతృప్తి పడొద్దని రాష్ట్ర నేతలకు హైకమాండ్ సూచించింది. ఈ ఫలితాలు రెండేండ్ల పాలనకు నిదర్శనమే అయినా.. 2029 ఎన్నికలు టార్గెట్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంలో టీమ్ వర్క్ మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకొని మంత్రులు మనస్పర్థలు తెచ్చుకోవద్దని, సర్దుకుపోతూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పార్టీ జోడెద్దులుగా ముందుకు సాగాలన్నారు. శాఖల వారీగా ఉత్తమ సంస్కరణలు తేవాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అండగా ఉండాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు.

పీసీసీ పదవులు, నామినేటెడ్ పోస్ట్ లకు క్లియరెన్స్

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) లో ఖాళీగా ఉన్న పోస్ట్ లతో పాటు, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ క్లియరెన్స్ ఇచ్చింది. లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలతో.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయిలో ఖాళీగా ఉన్న పీసీసీ పదవులను భర్తీ చేయాలని హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మిగిలిన నామినేటెడ్ పోస్ట్ లను భర్తీ చేయాలని ఆదేశించింది. 

మరోవైపు త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ మీటింగ్ లో చర్చించారు. దీనిపై సీఎం, పీసీసీలు రెండు, మూడు రోజుల్లో చర్చించి హైకమాండ్​కు అభ్యర్థుల పేర్లను సూచించాలని స్పష్టం చేశారు. అలాగే మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి తీరు, ఆయన చేసే ప్రకటనలపై కూడా హైకమాండ్ ఆరా తీసింది. ఈ అంశంలో త్వరలో ఆయనను ఢిల్లీకి పిలిచి మాట్లాడాలని నిర్ణయించింది.