140 ఏళ్ల సుధీర్ఘ ప్రస్థానం సాగిస్తున్న కాంగ్రెస్.. దేశానికి ఏం చేసిందనే ప్రశ్నలకు ఏకైక సమాధానం నేడు ప్రపంచంలోనే బలమైన శక్తిగా భారతదేశం నిలబడింది. అందుకు వేసిన పునాదిరాయి మొదలు ప్రపంచస్థాయి నిర్మాణాల వరకూ ప్రతీది భారత జాతీయ కాంగ్రెస్ చేసిన కృషి వల్లే సాధ్యమైంది.
1947కు అటూ ఇటుగా స్వాతంత్ర్యం పొందిన లెబనాన్, సిరియా, జోర్డాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా చివరకు పాకిస్థాన్ సహా ఏ దేశాలు సాధించని అద్భుత ప్రగతిని భారతదేశం సాధించింది. ఇదే కాంగ్రెస్ దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి చేసిన అతిగొప్ప మంచి.
విపరీతమైన జనాభా, అపరిమితమైన అసమానతలు, పరిమితమైన వనరులు ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి సారథ్యం వహించిన కాంగ్రెస్ నేడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎకానమీగా భారత్ ను రూపొందించడానికి పటిష్ట పునాదులు వేసింది. ఈ అతిగొప్ప కాంగ్రెస్ ప్రయాణం తెలుసుకోవడం అంటే మనదేశ గెలుపుదారుల్ని తడుముకోవడమే.
1885లో కాంగ్రెస్ ఆవిర్భావం
భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం ఒక చారిత్రక మలుపు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారి అణచివేత ధోరణి తీవ్రతరమైంది. ఆయుధ చట్టం, ప్రెస్ చట్టం వంటివి భారతీయుల గొంతు నొక్కేశాయి. మరోవైపు బ్రిటిష్‌వారి జాతి వివక్ష తీవ్రతరమైంది. కరువులు, ఆర్థిక దోపిడీతో సామాన్యులు చితికిపోతుంటే, విద్యనభ్యసించిన మధ్యతరగతి వర్గాల్లోనూ జాతీయ భావాలు మొలకెత్తాయి. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఒక అఖిల భారత వేదిక అవసరమని భావించారు.
ఈ నేపథ్యంలో రిటైర్డ్ అధికారి ఏ.ఓ. హ్యూమ్ చొరవతో 1885లో బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది. అప్పటివరకు ప్రాంతీయంగా చెదురుమదురుగా ఉన్న నిరసనలు ఒకే గొడుగు కిందకు కాంగ్రెస్ తీసుకొచ్చి బలమైన నిరసనల్ని నాటి బ్రిటీషర్లకు రుచిచూపింది.
ఇది భారతీయులలో ‘జాతి’ అనే భావనను, ప్రజాస్వామ్య విలువలైన స్వేచ్ఛ, సమానత్వాలను నరనరాన నింపింది. క్రమంగా అది 'స్వరాజ్యం' నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించే ప్రజాఉద్యమంగా మార్చింది కాంగ్రెస్. ఉత్తర, దక్షిణ భారతాలను ఏకంచేసి జాతీయ సమైక్యతకు పునాది వేసింది.
సామాజిక సంస్కరణలకు వేదిక
కాంగ్రెస్ కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసమే కాకుండా సామాజిక సంస్కరణలకు కూడా వేదికగా మారింది. అంటరానితనం నిర్మూలన, మహిళా సాధికారత, హిందూ, -ముస్లిం ఐక్యత వంటి అంశాలను జాతీయోద్యమంలో అంతర్భాగం చేసింది. 'స్వదేశీ ఉద్యమం' ద్వారా స్థానిక పరిశ్రమలకు, ఖాదీ వస్త్రాలకు ఊపిరిపోసి, ఆర్థిక స్వావలంబన ఆవశ్యకతను చాటిచెప్పింది.
బెంగాల్ విభజనకు నిరసనగా మొదలైన స్వదేశీ ఉద్యమం (వందేమాతరం ఉద్యమం - 1905) మొదలు సహాయ నిరాకరణ ఉద్యమం- 1920-–22), శాసనోల్లంఘన ఉద్యమం / ఉప్పు సత్యాగ్రహం - 1930, డూ ఆర్ డై నినాదంతో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం 1942 వంటివి ప్రపంచంలోనే ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య అహింసా ఉద్యమంతో మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టాయి.
1885 బొంబాయిలో డబ్ల్యూసీ బెనర్జీ ఆధ్వర్యంలోని మొదటి సమావేశంలోనే బ్రిటిష్ పాలనలో భారతీయులకు న్యాయబద్ధ అవకాశాల్ని డిమాండ్ చేసి సాధించింది. అది మొదలు 1906 మొదటిసారిగా 'స్వరాజ్యం' నినాదాన్నిచ్చింది. ఇలా కాంగ్రెస్ సమావేశాలు, తీర్మానాలు కేవలం రాజకీయ నిర్ణయాలే కాదు, ఆధునిక భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి, ప్రజాస్వామ్య విలువలకు పునాదులు వేశాయి.
‘ఆధునిక దేవాలయాలు’ ప్రాజెక్టులు
తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ‘ఆధునిక దేవాలయాలు’గా పిలుస్తూ భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు. భాక్రానంగల్, నాగార్జున సాగర్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులను నిర్మించి దేశ వ్యవసాయానికి ఊపిరి పోశారు. చదువుతోనే దేశం పురోగమిస్తుందని నమ్మి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్సిటీలు వంటివి ఎన్నో స్థాపించారు.
ఈ యువతకు ఉపాధితో పాటు వేగంగా దేశ పురోభివృద్దికి ప్రభుత్వ రంగ భారీ సంస్థలను స్థాపించి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికారు. డీఆర్‌డీఓ, అణుశక్తి కమిషన్‌ను సైనిక దళాల నిర్మాణంతో దేశాన్ని శత్రుదుర్భేద్యంగా మారుస్తూనే ప్రపంచానికే శాంతిని ప్రబోదించే ఆలీన విధానాల్ని సూచించారు.
హరిత విప్లవం, శ్వేత విప్లవాలతో ఆహార కొరతను తీర్చింది కాంగ్రెస్. బ్యాంకుల జాతీయకరణతో సామాన్యులకు, రైతులకు బ్యాంకులను చేరువ చేసింది. 1975లోనే తొలి భారతీయ ఉపగ్రహం 'ఆర్యభట్ట' ప్రయోగం, 1974లో పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపింది. గరీబీ హటావో అంటూ 20 సూత్రాల కార్యక్రమంద్వారా పేదరిక నిర్మూలనకు, రాజభరణాల రద్దుతో సంపదను అందరికీ పంచింది కాంగ్రెస్సే.
పేదవాడి తలరాతను మార్చిన కాంగ్రెస్
సోనియా గాంధీ యూపీఏ చైర్ పర్సన్‌గా, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రపంచలోనే అతిపెద్ద పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంతో పేదవాడి తలరాతను కాంగ్రెస్ మార్చింది. కాంగ్రెస్ చేసిన ఇన్ని ఘనతలు మన కళ్లముందుండగా చూడలేని దౌర్భాగ్య మనస్తత్వాన్ని నేటి కేంద్ర పాలక పార్టీ ప్రజల్లో పెంచి పోషిస్తుంది, నయా సూడోవాదంతో ప్రజల కళ్లకు గంతలు కట్టి గాంధీ వారసత్వమైన కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లోంచి తీసేసి గాడ్సే వారసుల్ని ప్రతిష్టించే కుట్రలు చేస్తోంది.
దేశ చరిత్రకే వక్రభాష్యం చెపుతూ కుల, మత, వర్గ ఘర్షణల్ని రేకెత్తిస్తూ తమ పబ్బం గడుపుకుంటోంది. కానీ, వివేకులైన ఈ దేశ ప్రజల్ని మళ్లీ జాగరూకత వైపు నడపడానికి రాహుల్ గాంధీ సారథ్యంలో, మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ మార్గదర్శనంలో పోరాట పంథాల్ని కాంగ్రెస్ రూపొందిస్తోంది.
ప్రజలకు తమ నిజమైన ఘనచరితల వారసత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే కాంగ్రెస్ ఆవిర్భావం అనేది కేవలం ఒక పార్టీ ఏర్పాటు మాత్రమే కాదు, ఒక జాతిని మేల్కొలిపిన చారిత్రక ఘట్టం. ఆధునిక భారతదేశ నిర్మాణానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు, నేటి ప్రపంచ పురోగతికి ఊపిరులూదిన నిత్యనూతన చైతన్యం.
- పున్నాకైలాస్ నేత,డీసీసీ అధ్యక్షుడు, నల్గొండ జిల్లా
