గీత దాటిన నేతలపై వేటుకు పీసీసీ వెనుకడుగు

గీత దాటిన నేతలపై వేటుకు పీసీసీ వెనుకడుగు

రాష్ట్ర కాంగ్రెస్​లో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై వేటు పడుతుందా, లేక షోకాజ్​ నోటీసులతోనే సరిపుచ్చుతారా అన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వరుస ఎన్నికల్లో ఎదురుదెబ్బలతో రాష్ట్రంలో పార్టీ సంక్షోభంలో ఉండటంతో నేతలెవరినీ చేజార్చుకోవద్దని కాంగ్రెస్​ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం. నేతలపై కఠిన చర్యలేమీ తీసుకోకుండా వివరణ తీసుకోవడంతో సరిపుచ్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, కొందరు కీలక నేతలు బీజేపీ, టీఆర్ ఎస్​లలో చేరడం, ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏఐసీసీ హైకమాండ్.. నాయకత్వం పీసీసీకి ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండో సారి షోకాజ్..

కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమై రాజగోపాల్ రెడ్డి మాటలు క్రమశిక్షణ ఉల్లంఘనేనని నిర్ధారించింది. కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా హైకమాండ్ కు నివేదించింది. హైకమాండ్​ రాజగోపాల్​రెడ్డి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పలేదని సమాచారం. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రాజగోపాల్ రెడ్డి పీసీసీ నాయకత్వంపై  విమర్శలు చేశారు. అప్పుడు క్రమశిక్షణ కమిటీ కేవలం షోకాజ్ ఇచ్చి వివరణ తీసుకుంది.

కొంత మెత్తగా..

రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు చర్యలు చేపట్టాలని హైకమాండ్​ ఇక్కడి నేతలను ఆదేశించింది. ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరించాలని సూచించినట్టు తెలిసింది. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం వచ్చే వరకు కేడర్​ను, లీడర్లను కాపాడుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. అందువల్లే పీసీసీ నుంచి గట్టి స్పందన కనబడటం లేదని అంటున్నారు. రాష్ట్రంలో తొలుత బలంగా ఉన్న కాంగ్రెస్.. ఇలా తంటాలు పడడం వెనుక కారణం సమిష్టి నాయకత్వ లోపమేనని పార్టీలో చర్చ సాగుతోంది. ఆధిపత్య పోరు, సీనియర్ల మధ్య అనైక్యత కారణంగానే.. రాజగోపాల్​రెడ్డి వంటి నేతల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.