బీసీలు, మైనార్టీల మధ్య కాంగ్రెస్​ చిచ్చుపెడ్తున్నది : కేటీఆర్

బీసీలు, మైనార్టీల మధ్య  కాంగ్రెస్​ చిచ్చుపెడ్తున్నది  : కేటీఆర్
  • బీజేపీ ఎజెండా అమలుకు ఈ పార్టీ కుట్రలు: కేటీఆర్
  • మైనార్టీల జనగణన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి
  • కొడంగల్, గోషామహల్, హుజూరాబాద్​లోనూ గెలుస్తం
  • కేసీఆర్​ను ఖతం చేయనీకి ఢిల్లీ నుంచి క్యూ కడుతున్నరు
  • ఆయన్ను, బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: బీసీలు, మైనార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ​ చిచ్చు పెడుతున్నదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. బీసీలతో పాటు మైనార్టీల జనగణన చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులను మత పరమైన మైనార్టీలుగా గుర్తించిందని, ఇప్పుడు జనగణన చేపట్టి వాళ్లను బీసీల్లో చేర్చితే రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోతారని చెప్పారు. బీసీల కులగణన చేసుకోవచ్చని, కానీ మైనార్టీల గణన సరికాదన్నారు. ఇదే జరిగితే మైనార్టీ మంత్రిత్వ శాఖ, వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్, కమిషన్, కార్పొరేషన్ సహా అన్ని హక్కులు వాళ్లు కోల్పోతారని తెలిపారు. కాంగ్రెస్ ​పార్టీ మైనార్టీల కులగణన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. బీజేపీ బస్మాంద ముస్లింలు అంటోందని, ఆ పార్టీ భావజాలం ఉన్న వ్యక్తే పీసీసీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టే బీజేపీ ఎజెండాను కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్​లో చేర్చారని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న బీసీలు, మైనార్టీల మధ్య కాంగ్రెస్ ​పంచాయితీ పెడుతోందన్నారు.

మైనార్టీలకు 10వేల కోట్లు ఖర్చు పెట్టినం

మైనార్టీలకు ఏటా రూ.4 వేల కోట్ల బడ్జెట్​ పెడుతామన్న కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు మైనార్టీల కోసం ఖర్చు చేసింది రూ.930 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేండ్లలో రూ.10,140 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మైనార్టీల సంక్షేమంపై తమకున్న సిన్సియారిటీ ఏమిటో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్​పార్టీ మైనార్టీ డిక్లరేషన్​లో చెప్పినదాని కన్నా తమ ప్రభుత్వం ఎక్కువే చేసిందన్నారు. 2024లో కేంద్రంలో సెక్యులర్​ ప్రభుత్వం వస్తుందని, ఆ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే బీఆర్ఎస్ ​మైనార్టీలతో పాటు ఎస్సీల రిజర్వేషన్ల పెంపునకు ఆమోదముద్ర వేసేలా చేస్తుందన్నారు.

ఉదయ్​పూర్​ డిక్లరేషనే అమలు చేయలే

కాంగ్రెస్​తో బీజేపీ కలిసి పోయిందని, అందుకే బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రాజాసింగ్​పోటీ చేస్తున్న స్థానాల్లో వీక్​క్యాండిడేట్లను పోటీకి దించిందని కేటీఆర్​ఆరోపించారు. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​నే తుంగలో తొక్కిన కాంగ్రెస్ మిగతా డిక్లరేషన్​లను అమలు చేస్తుందంటే ఎలా నమ్మాలో చెప్పాలన్నారు. ఇది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదేనని ఎద్దేవా చేశారు. కొడంగల్, గోషామహల్, హుజురాబాద్​ నియోజకవర్గాల్లో తామే గెలువబోతున్నామని చెప్పారు. కామారెడ్డిలో తాను గెలవడం లేదని రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్​లో ఒప్పుకున్నాడని తెలిపారు. హైదరాబాద్​సిటీని అభివృద్ధి చేస్తామని, మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఎవరో ఎక్కడో ల్యాండ్​పూలింగ్​చేశారని.. ఇక్కడ రాచకొండలో అదే చేసి కొత్త సిటీ నిర్మిస్తామని రేవంత్​ అంటున్నారని, ఆయన అలాంటి మాటలు ఎంత ఎక్కువ మాట్లాడితే తమ పార్టీకి అంత లాభమన్నారు. ఆ కొత్త సిటీలో నిరుద్యోగులు మూడుపూటలా కూరగాయలు అమ్ముకునేలా చేస్తామనడం రేవంత్​ విజన్ అని ఎద్దేవా చేశారు. సమావేశంలో మంత్రి మహమూద్​అలీ, బీఆర్ఎస్ మైనార్టీ నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్​ను ఖతం చేయాలని ఢిల్లీ నుంచి లైన్ కడుతున్నరు

తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్​ను ఖతం చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, రాహుల్​గాంధీ.. బీజేపీ, కాంగ్రెస్​ నాయకులు రాష్ట్రానికి లైన్​కడుతున్నారని కేటీఆర్​అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వర్, మునుగోడుకు చెందిన పీసీసీ ఉపాధ్యక్షుడు ప్రసన్న, నక్క ప్రభాకర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు. వారికి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.