లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి : చిదంబరం

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి : చిదంబరం

న్యూఢిల్లీ :  లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలను, సూచనలను ఆహ్వానిస్తూ కాంగ్రెస్‌‌‌‌ పార్టీ బుధవారం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌, ఈమెయిల్‌‌‌‌ ఐడీని ప్రారంభించింది. మేనిఫెస్టోను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత పి. చిదంబరం నేతృత్వం వహిస్తున్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రతి రాష్ట్రంలోని ప్రజలతో సంప్రదింపులు జరిపి సూచనలు సేకరిస్తారని ఆయన తెలిపారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. సూచనల కోసం ఈమెయిల్‌‌‌‌, ప్రత్యేక వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను రూపొందించినట్లు చిదంబరం వెల్లడించారు.

వీటి ద్వారా దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువమంది నుంచి సూచనలు స్వీకరిస్తామన్నారు. మేనిఫెస్టో కోసం awaazbharatki@inc.inకు సలహాలు ఇవ్వొచ్చు లేదా www.awaazbharatki.inలో నేరుగా అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయవచ్చని పార్టీ తెలిపింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌‌‌ ‘ఎక్స్‌‌‌‌’ (ట్విట్టర్‌‌‌‌) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌‌‌‌ కేవలం పార్టీ కాదు. ప్రజల గొంతుక. టాప్‌‌‌‌- డౌన్‌‌‌‌ విధాన రూపకల్పనను విశ్వసించదు. సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను తీసుకువస్తుంది. మేనిఫెస్టో ఎలా ఉండాలో సూచనల ద్వారా తెలియజేయండి’’ అని పోస్టు పెట్టారు.