మూసీ బాధితులతో రాజకీయాలా? : కాంగ్రెస్ నేత చనగాని దయాకర్

మూసీ బాధితులతో రాజకీయాలా? :  కాంగ్రెస్ నేత చనగాని దయాకర్
  • బీఆర్‌‌ఎస్, బీజేపీపై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడితే..బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాత్రం అక్కడి ప్రజలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

మూసీ నది ప్రక్షాళనతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు ఖ్యాతి దక్కనుందనే అక్కసుతోనే బీజేపీ, బీఆర్ఎస్..అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.

ఈ రెండు పార్టీలు గాంధీ సరోవర్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి  పోటీపడుతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు..రేవంత్ సర్కార్ ప్రజా పాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సమాజం ఈ రెండు పార్టీల నిజ స్వరూపాన్ని గత రెండున్నరేండ్లుగా గమనిస్తున్నాయని చెప్పారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో  బీజేపీ, బీఆర్ఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చనగాని హెచ్చరించారు.