కేటీఆర్​ను మెంటల్  హాస్పిటల్​లో చేర్పించాలి : చరణ్ కౌశిక్ యాదవ్

కేటీఆర్​ను మెంటల్  హాస్పిటల్​లో చేర్పించాలి : చరణ్ కౌశిక్ యాదవ్

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ పై మానసిక ఆరోగ్య తెలంగాణ చట్టం, సెక్షన్ 12(2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పీసీసీ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ మానసిక పరిస్థితి మెరుగుపడేందుకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చేర్చాలన్నారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే సీఎం సహాయనిధి నుంచి నిధులు కేటాయించాలని కోరారు.

సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ నేతలు బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్, బహదూర్ శ్రీనివాస్  మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఛీత్కారానికి గురైన విషయాన్ని జీర్ణించుకోలేక ట్విట్టర్ పిట్ట కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలుతో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకపోతున్నారని ఫైరయ్యారు. అందుకే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కేటీఆర్ సినిమా తీస్తుండొచ్చని, అందులో మాత్రమే ఇకపై  కేసీఆర్ ను సీఎంగా చూపించొచ్చన్నారు.

అంతేకానీ ప్రజాస్వామంలో అది సాధ్యం కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాన్నీ పట్టించుకోని కేటీఆర్... పదవులు ఊడాక ఆటోల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని.. అది ఓర్వలేక ‘కేడీ’ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబం జైలుకు పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.