ఎర్రబెల్లిని మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలె

ఎర్రబెల్లిని మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలె

హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత గీతా రెడ్డి ఫైర్ అయ్యారు. మహిళా ఎంపీడీవోతో ఎర్రబెల్లి మాట్లాడిన తీరు సరికాదని ఆమె మండిపడ్డారు. మంత్రి అంత వల్గర్‌గా మాట్లాడటాన్ని సభ్యసమాజం హర్షించదన్నారు. పది మంది ముందు ఓ మహిళను అవహేళన చేయడం దారుణమన్నారు. ఎర్రబెల్లి ఇంటి ముందు ధర్నాలు చేయడం ముఖ్యం కాదని.. ఆయనపై చర్యలు తీసుకునేలా చేయాలన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గీతా రెడ్డి విమర్శలకు దిగారు. 

పెట్రోల్, డీజిల్‌పై స్టేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గించట్లే?
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బీజేపీ ప్రభుత్వం 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. వంటగ్యాస్ ధరలు కూడా 200 సార్లకు పైగా పెంచారు. అడిషనల్ కలెక్టర్‌‌ల కోసం కియా వెహికిల్స్ కొనుగోలు చేస్తారు. కానీ పెట్రోల్, డీజిల్ ధరలపై స్టేట్ ట్యాక్స్ తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే మన దేశంలో మాత్రం పెరుగుతున్నాయి. సెస్‌‌లు, ట్యాక్స్‌‌లు తగ్గిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయట్లేదు. కరోనా వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే కేంద్రం మాత్రం కనికరించడంలేదు. సంవత్సరానికి రూ.14 వేల కోట్లు కేవలం క్రూడాయిల్ ద్వారానే కేంద్రానికి వస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో క్రూడాయిల్‌‌పై రాష్ట్ర ట్యాక్స్ తక్కువగానే ఉంది’ అని గీతా రెడ్డి స్పష్టం చేశారు.