
- కవిత దీక్ష ప్రకటనపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తానని బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేయడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్అయ్యారు. ‘‘పదేండ్ల పాటు వాళ్ల నాయన కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన తర్వాత గుర్తుకు వచ్చారా?’’ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అసలు కవిత ఎవరు? ఆమె కెపాసిటీ ఏమిటి? ఆమె ఏమైనా లీడరా?’’ అంటూ ఫైర్ అయ్యారు.
వాళ్ల నాయన దుకాణం బంద్ అయిందని కవిత ఇప్పుడు బీసీలు అంటూ మరో దుకాణం పెట్టిందని విమర్శించారు. అసలు ఆమె గురించి మాట్లాడడం ఏమిటి? ఏంది ఆమె డ్రామాలు అంటూ దుయ్యబట్టారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే కవిత బీసీ రిజర్వేషన్ల నినాదాన్ని ఎత్తుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఇన్ని రోజులు ఏం చేశారు, రిజర్వేషన్లపై ఇప్పుడు ఈ కార్యక్రమాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లు, కులగణన అనేది రాహుల్ గాంధీ నినాదం అని ఆయన స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ తో కలిసి రావాలని కోరారు.
చిత్తశుద్ధి ఉంటే బీజేపీ సర్కార్‌పై పోరాడాలి: విప్ ఆది శ్రీనివాస్
కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వాళ్ల నాయన కేసీఆర్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి బీజేపీ సర్కార్‌పై పోరాడాలని విప్ ఆది శ్రీనివాస్ సవాల్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కల్వకుంట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందని విమర్శించారు. ‘‘బీసీ రిజర్వేషన్ల కోసం మా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటిస్తే.. కవిత మాత్రం డ్రామాలకు సిద్ధమైంది.
నిరాహార దీక్ష చేస్తామని కవిత చెపుతున్నది. ఆమె ఏ హోదాలో దీక్ష చేస్తది? మీ అయ్య ఫాంహౌస్ లో పడుకుంటడు. నువ్వు, మీ అన్న డ్రామాలు ఆడుతున్నారు. బీజేపీ పైన మాట్లాడడానికి మీకు నోరు రాదు. మోదీని చూసి నువ్వు, మీ అయ్య వణికిపోతున్నారు. తెలంగాణ లో దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది? మేము అసెంబ్లీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపాం. ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ కి పంపాం. మా చిత్త శుద్ధి లో ఏం లోపం ఉంది? మీ కల్వకుంట్ల డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరు” అని ఆయన అన్నారు.
కవితది డైవర్షన్ పాలిటిక్స్: విప్ బీర్ల ఐలయ్య
కవితది డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కవిత దీక్ష చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్పదేండ్ల పాలనలో కేసీఆర్, కవితకు బీసీల రిజర్వేషన్లు గుర్తుకు రాలేదా? అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. బీసీ పక్షపాతిగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. కవిత గల్లీలో దీక్ష చేయడం కాదు.. ఢిల్లీలో చేయాలని డిమాండ్ చేశారు.