టీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

టీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు

అగ్నిపథ్ నిరసనలో నిన్న సికింద్రాబాద్ కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై డీసీసీ అధ్యక్షుడు,కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాకేష్ ను చంపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు. రాకేష్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారని రాజేందర్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

వరంగల్ పోలీసుల తీరు ఆక్షేపనీయమని ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ వైఫల్యం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారు. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని విమర్శించారు.రాకేష్ డెడ్ బాడీని చూసే స్వేచ్ఛా విపక్షాలకు లేదా అని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు.

సైన్యంలో నియామకాల కోసం తీసుకువస్తున్న అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు విధ్వంసానికి దిగారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసు బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడగా, వారిలో దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మిగిలిన వారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.