
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లు మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధికి చేసిందేంటో చెప్పాలని పీసీసీ నేత పున్న కైలాష్ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బుధవారం గాంధీభవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 18 నెలల కాలంలో12 సార్లు సమీక్ష జరిపితే, జగదీశ్ రెడ్డి మంత్రిగా ఏ ఒక్క నాడు జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేయలేదని విమర్శించారు.
సొంత గ్రామానికి కొత్తగా ఒక్క రేషన్ కార్డు, విద్యుత్తు మంత్రిగా ఒక్క ట్రాన్స్ ఫార్మర్ ను తెప్పించుకోలేకపోయారని చెప్పారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు నల్గొండ జిల్లాలో తిరిగే ముఖం లేదని, ఇప్పటికైనా రేవంత్ పై చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు.