3 రోజుల్లో 30 గంటల పాటు విచారించిన ఆఫీసర్లు

3 రోజుల్లో 30 గంటల పాటు విచారించిన ఆఫీసర్లు
  • 3 రోజుల్లో 30 గంటల పాటు విచారించిన ఆఫీసర్లు
  • ఢిల్లీలోని ఈడీ ఆఫీసును ముట్టడించిన కాంగ్రెస్ కేడర్​
  • కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.. పలువురు నేతల అరెస్ట్

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్​మాజీ చీఫ్ రాహుల్​గాంధీ వరుసగా మూడోరోజు బుధవారం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. మూడో రోజూ ఆయనను సుదీర్ఘంగా 9 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం11.35 గంటలకు జెడ్ ప్లస్ కేటగిరీ సీఆర్​పీఎఫ్ సెక్యూరిటీతో రాహుల్​ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలామ్ రోడ్డులో ఉన్న ఈడీ హెడ్​ఆఫీసుకు చేరుకున్నారు. ఆయన వెంట చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. 

మళ్లీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోమవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు రాహుల్ ఈడీ విచారణకు హాజరు కాగా.. దాదాపు 30 గంటల పాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. సోమవారం 10 గంటలపాటు, మంగళవారం 11 గంటలపాటు విచారణ సాగింది. మధ్యలో రాహుల్ తన తల్లి సోనియాగాంధీని హాస్పిటల్​లో పరామర్శించేందుకు వెళ్లి వచ్చారు. బుధవారం కూడా సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారణ జరిగింది. యంగ్ ఇండియా కంపెనీకి సంబంధించే 16 ప్రశ్నలను రాహుల్​పై ఈడీ సంధించినట్లు తెలిసింది. శుక్రవారం మళ్లీ విచారణకు రావాలంటూ రాహుల్​కు ఈడీ అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు.   

నిరసనలు.. అరెస్టులు    

ఢిల్లీలోని ఈడీ ఆఫీసు ముందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్​ విధించారు. కాంగ్రెస్ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ఆఫీసు ముందు కూడా నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ మండిపడ్డారు. ఏఐసీసీ ఆఫీసులోకి పార్టీ లీడర్లను పోలీసులు అనుమతించకపోవడంతో.. తమ ఆఫీసులోకి ఢిల్లీ పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాహుల్​కు మద్దతుగా తాము తమ ఆఫీసులో ఆందోళనకు దిగితే అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్​ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ ​చేశారు. గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ కేడర్​కు ఆయన పిలుపునిచ్చారు.