
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోడీ వరుసగా విజయ సంకల్ప సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బీజేపీ తరఫున క్యాంపెయిన్ ముమ్మరం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగారు. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్ లోనూ పవర్ చేజిక్కించుకోవడం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సోమవారం తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగి బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
మహువా/గాంధీనగర్: ఆదివాసీలే ఈ దేశానికి మొదటి యజమానులు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. జల్, జంగల్, జమీన్ తోనే ఆదివాసీల జీవన విధానం ముడిపడి ఉందన్నారు. బీజేపీ మాత్రం ఆదివాసీలను వనవాసీలు అని పిలుస్తోందని విమర్శించారు. ఆదివాసీల హక్కులను, భూములను లాక్కుని ఇద్దరు, ముగ్గురు వ్యాపారవేత్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘మీరు ఈ దేశానికి ఫస్ట్ ఓనర్లు అని వారు చెప్పరు. కానీ మీరు అడవుల్లో నివసిస్తారని అంటారు. ఈ తేడా మీకు కన్పిస్తోందా? మీరు సిటీల్లో నివసించడం వారికి ఇష్టం లేదు. మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని, విమానాలు నడపాలని, ఇంగ్లిష్‌లో మాట్లాడాలని వారు కోరుకోవట్లేదు” అని రాహుల్ ఆరోపించారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా సోమవారం సూరత్ జిల్లాలోని మహువాలో జరిగిన సభలో ఆదివాసీలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీచ్ కు ఓ వ్యక్తి అడ్డు తగిలాడు. ‘‘మీరు హిందీలో మాట్లాడండి. మేం అర్థం చేసుకుంటాం” అని అరిచాడు. దీంతో స్పీచ్‌ను ఆపిన రాహుల్.. అతడి వైపు చూస్తూ.. “హిందీ నడుస్తదా?” అని అడిగారు. వెంటనే జనమంతా ఓకే అంటూ అరిచారు. దీంతో ఆయన స్పీచ్ హిందీలో కొనసాగించారు.
స్కూళ్లు కట్టేది, ఫ్రీ కరెంట్ ఇచ్చేది మేమే: కేజ్రీవాల్
గుజరాత్ లో స్కూళ్ల గురించి తమ పార్టీ తప్ప ఇతర పార్టీలు మాట్లాడట్లేదని, తమను గెలిపిస్తే.. స్కూళ్లు, ఆస్పత్రులు కట్టిస్తామని, ఉచిత విద్యుత్, ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. బీజేపీకి 27 ఏండ్లపాటు అధికారం ఇచ్చారని, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. హామీలను నిలబెట్టుకోలేకపోతే మళ్లీ రాష్ట్రానికి రానన్నారు. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా హలోల్‌లో సోమవారం ఆప్ నిర్వహించిన రోడ్ షోలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా కొంతమంది మోడీ.. మోడీ అని నినాదాలు చేశారు. దీంతో ప్రసంగాన్ని ఆపిన కేజ్రీవాల్ ఆ తర్వాత మళ్లీ మాట్లాడారు. ఎవరికి అనుకూలంగానైనా స్లోగన్లు చేయవచ్చు, కానీ మీ పిల్లల కోసం స్కూళ్లు కట్టేది మాత్రం తానేనని అన్నారు. ఆ స్లోగన్స్ ఇచ్చినోళ్ల మనసులను కూడా ఏదోరోజు గెలుస్తామన్నారు.