కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెదిరింపులు

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెదిరింపులు

జోడో యాత్ర టార్గెట్​గా బాంబు దాడి చేస్తం
కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెదిరింపులు
ఇండోర్​లోని ఓ స్వీట్ షాపు వద్ద లేఖ వదిలిన దుండగులు

ఇండోర్ : భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. రాహుల్​ యాత్ర మధ్యప్రదేశ్​లోని ఇండోర్​కు చేరుకోగానే నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోతుందని పేర్కొంటూ ఓ స్వీట్ షాపు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు లేఖ వదిలివెళ్లారు. ఆ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఇది ఆకతాయిల పని కావొచ్చని, అయినప్పటికీ సెక్యూరిటీ పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఇండోర్ పోలీస్ కమిషనర్ మిశ్రా శుక్రవారం వెల్లడించారు. రాహుల్ జోడో యాత్ర ఈ నెల 20న మధ్యప్రదేశ్‌‌‌‌లోకి ప్రవేశించి ఈ నెల 28న ఇండోర్​కు చేరుకోనుంది.

రాహుల్​ చెప్పింది నిజమే : తుషార్ గాంధీ

రాహుల్ యాత్ర అకోలా జిల్లా బాలాపూర్​ నుంచి శుక్రవారం ఉదయం కొనసాగింది. బుల్దానా జిల్లాకు చేరుకోగానే మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ యాత్రలో జాయిన్ అయ్యారు. రాహుల్​​తో కలిసి నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీడీ సావర్కర్​పై రాహుల్ చెప్పింది నిజమేనని అన్నారు. సావర్కర్ బ్రిటిషర్లకు తొత్తులా వ్యవహరించారని, అందుకు ఆధారాలున్నాయని అన్నారు. 

రాహుల్​పై పరువునష్టం కేసు

రాహుల్​గాంధీపై మహారాష్ట్రలోని థానే పోలీస్ స్టేషన్​లో పరువు నష్టం కేసు నమోదైంది. సావర్కర్ ను కించపర్చేలా మాట్లాడారంటూ  ఏక్​నాథ్​ షిండే వర్గం శివసేన నేత వందనా డోంగ్రే చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్​ఐఆర్ ఫైల్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. సెక్షన్ 500, 501 కింద కేసు నమోదు చేశామన్నారు. మరోవైపు, రాహుల్ కామెంట్లకు నిరసనగా సావర్కర్ జన్మస్థలమైన నాసిక్‌‌‌‌లోని భాగూర్ వాసులు శుక్రవారం బంద్ పాటించారు.