కాంగ్రెస్ ఖమ్మం సభకు..బస్సులు ఇవ్వలేరట!

కాంగ్రెస్ ఖమ్మం సభకు..బస్సులు ఇవ్వలేరట!
  • కాంగ్రెస్ ఖమ్మం సభకు..బస్సులు ఇవ్వలేరట!
  • ముందు ఓకే అని తర్వాత కుదరదన్న ఆర్టీసీ అధికారులు
  • 350 బస్సులు అద్దెకు కావాలని కాంగ్రెస్ నేతల వినతి
  • తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడంపై విమర్శలు
  • ఇది రాష్ట్ర సర్కారు కుట్రే అంటూ ఫైర్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  జులై 2న ఖమ్మంలో నిర్వహించబోయే కాంగ్రెస్​ మీటింగ్​కు సర్కారు ఆటంకాలు కల్పిస్తోందని హస్తం పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇందుకు తగినట్లే సభకు జనసమీకరణ కోసం 350 బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీకి రిక్వెస్ట్​పెట్టగా అధికారులు తిరస్కరించారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో కేటాయించలేకపోతున్నామని చెప్పారు. సత్తుపల్లి డిపోలోని ఆర్టీసీ అధికారులైతే ముందు అడ్వాన్స్ తీసుకొని తర్వాత వెనక్కి తిరిగి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన కేసీఆర్ సభకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్​జిల్లాల పరిధిలోని ఆర్టీసీ డిపోల నుంచి పెద్దసంఖ్యలో బస్సులను తరలించిన ఆర్టీసీ, ఇప్పుడు మాత్రం సరిపడా బస్సులు లేవని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి.

సంస్థకు రూ.87 లక్షలు లాస్

భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేరిక సందర్భంగా జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్​ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రాహుల్ హాజరుకానున్న ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి భావిస్తున్నారు. ఇందుకు తగినట్లే ఆయన అనుచరులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పబ్లిక్​ను తరలించేందుకు 350 ఆర్టీసీ బస్సులు కావాలని భావిస్తున్న నేతలు డిపోల చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో బస్సులు అద్దెకిస్తామన్న కొత్తగూడెం ఆర్టీసీ అధికారులు ఒక్కో బస్సుకు రూ.25వేల చొప్పున చెల్లించాలని రేటు కూడా చెప్పారు. తీరా బుధవారం మాట మార్చారు. సరిపడా బస్సులు లేనందున కేటాయించలేమని చెప్పారు. ఇక సత్తుపల్లి డిపోలో అంతకు ముందు కట్టిన అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశారని పొంగులేటి అనుచరులు చెబుతున్నారు. 

బీఆర్ఎస్​సభలకు ఉన్న బస్సులన్నీ కేటాయించి, ప్రయాణికులకు ఇబ్బంది పెడ్తున్న ఆర్టీసీ, తమకు కొన్ని బస్సులు కూడా కేటాయించకపోవడం ముమ్మాటికీ వివక్షే అని, కాంగ్రెస్​మీటింగ్​కు పబ్లిక్​తరలింపును అడ్డుకునేందుకు సర్కారు పన్నుతున్న కుట్రలో ఇది ఓ భాగమని ఆరోపిస్తున్నారు. బస్సులను ప్రైవేట్ కార్యక్రమాలకు అద్దెకిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసే ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ సభ రూపంలో వచ్చిన అవకాశాన్ని కాదనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఒకేరోజు రూ.87 లక్షల ఆదాయం వచ్చేదని, ప్రభుత్వం తీరుతో ఇప్పుడా మొత్తం కోల్పోయినట్లయిందని సంస్థ అధికారులు లోలోపల మదనపడుతున్నారు. 

బీఆర్ఎస్​ సభలకు ఎన్నైనా ఇస్తున్నరు

కాంగ్రెస్​ నిర్వహించే బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వాలని అడిగితే ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు తర్వాత ఇవ్వలేమన్నారు. పై స్థాయి అధికారుల నుంచి ఫోన్లు రావడం వల్లే ఇలా చేశారు. బీఆర్ఎస్​ నిర్వహించే సభలకు మాత్రం ఎన్ని బస్సులైనా ఇస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే మీటింగులకు ఇవ్వకపోవడం ముమ్మాటికీ కుట్రే. కాంగ్రెస్​ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకున్నది. బీఆర్ఎస్​చౌకబారు కుట్రలను జనం ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. 

- కోరం కనకయ్య, జడ్పీ చైర్మన్, భద్రాద్రికొత్తగూడెం

బస్సులు అందుబాటులో లేవు

కాంగ్రెస్​ లీడర్లు బస్సులను అడిగిన మాట వాస్తవమే. రేట్ల వివరాలు కూడా చెప్పాం. తగినన్ని బస్సులు అందుబాటులో లేకపోవడం వల్లే అద్దెకు  ఇవ్వలేకపోతున్నాం.

- బాణాల వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, కొత్తగూడెం