దేశంలో 80 శాతం ఉప్పు గుజరాత్ లోనే ఉత్పత్తి: మోడీ

దేశంలో 80 శాతం ఉప్పు గుజరాత్ లోనే ఉత్పత్తి: మోడీ

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకే రాహుల్ యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్ లోని సరేంద్రనగర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. దేశంలోని ఉప్పులో 80 శాతం గుజరాత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు. రాష్ట్రంలో తయారు చేసిన ఉప్పును తిని కూడా కొందరు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇటీవల మహారాష్ట్రలో రాహుల్ తలపెట్టిన భారత్ జోడో యాత్రలో నర్మదా బచావో ఆందోళన్ అధినేత మేధా పాట్కర్ పాల్గొనడాన్ని మోడీ ప్రస్తావించారు. నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 40 ఏండ్లుగా అడ్డుకున్న వారిని శిక్షించాలని గుజరాత్ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. తనకు హోదా లేదని ప్రజలకు సేవకుడని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గుజరాత్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.