
చొప్పదండి, వెలుగు: కరీనగర్జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొవిడ్రూల్స్ బ్రేక్ చేశారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. చెక్కుల పంపిణీ పేరుతో క్యాంపు ఆఫీస్లో లబ్ధిదారులను ఒకచోటికి చేర్చి సామూహిక కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేరుతో లబ్ధిదారులను ఒకచోటికి చేర్చి ఎమ్మెల్యే రవిశంకర్ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపించారు. చెక్కులు ఏవైనా ఉంటే సర్పంచుల ద్వారా అందజేయాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మానుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలలో కరోనా టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ అందుబాటులో ఉండట్లేదని వాటిపై దృష్టి పెట్టాలని కోరారు. అన్ని మండలాల్లో ప్రభుత్వం తరఫున ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు సంబోజి సునీల్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండేటి విజయ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.