దేశంలో నియంతృత్వ పాలన సాగుతోంది

దేశంలో నియంతృత్వ పాలన సాగుతోంది

కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ. ప్రశ్నిస్తే 124ఏ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంలో ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎవరు కొనుగోలు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మల్లన్న సాగర్ ముట్టడికి యత్నించినప్పటినుంచి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు.

తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్‌ చేసిందని రాజనర్సింహ ఆరోపించారు. ఫోన్‌ హ్యాకింగ్‌ మన దేశం చేస్తోందా? శత్రుదేశం చేస్తోందా? అని ప్రశ్నించారు. ఐటీ, ప్రైవసీ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.


రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆలోచించిన GST వేరు.. బీజేపీ తెచ్చింది వేరని అన్నారు. లౌకికవాద దేశంగా ఉంచడం ఇష్టంలేకనే సిఏఏ తెచ్చారన్నారు. సామాన్య ప్రజల కోసమే కాంగ్రెస్ పోరుబాట పట్టిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..ప్రతిపక్షాల నోరు మూసేందుకే వారిపై నిఘా పెట్టిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోపాటు తన దగ్గర పని చేసేవారిపై కూడా నిఘా కేంద్రం పెట్టిందన్నారు. బ్రిటిష్ వారికంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ పెద్ద నేరమన్న గీతారెడ్డి.. అమిత్ షా ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారించడంతోపాటు , సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. ఎలక్షన్ కమిషనర్ ఫోన్ ట్యాప్ కి గురికావడం సిగ్గుచేటన్నారు.


నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందన్నారు కాంగ్రెస్ మరో నాయకుడు దాసోజు శ్రవణ్. వ్యక్తిగత సమాచారాన్ని లూటీ చేస్తూ దొంగ పిల్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూలిపోతుందనే  భయం మోడీకి పట్టుకుందన్నారు. దైర్యం ఉన్నవాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయలేరన్నారు. మోడీ ప్రభుత్వం మతపరమైన భావనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందన్నారు.
కేసీఆర్ ఇంటిదొంగ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్. వ్యక్తుల డేటా మొత్తం ఉంది అంటూ స్యయంగా జయేష్ రంజన్ అనే అధికారి చెప్తున్నదంటే రాష్ట్రంలో పరిస్థితులు  ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. మోడీ, కేసీఆర్ లు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడున్నారన్న దాసోజు..సీరియస్ అంశాలను మాట్లాడుకునేవారు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని మాట్లాడండి అని తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే మోడీ, కేసీఆర్ లాంటి దొంగలకు శిక్ష వేస్తామని స్పష్టం చేశారు.