- రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయాన్ని నిరూపిస్తం
- కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ఫైర్
- కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తగ్గిస్తూ కేంద్రం దగ్గర సంతకం పెట్టిండు
- రాజకీయంగా పునర్జన్మనిచ్చిన పాలమూరుకు తీరని ద్రోహం చేసిండు
- మేడిగడ్డ సందర్శన పేరుతో బీఆర్ఎస్ నేతలు సర్కస్ ఫీట్లు వేస్తున్నరని ఫైర్
- ఇయ్యాల వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్
- ఎమ్మెల్యేల పర్యటన.. ఉదయం 11 గంటలకు కరివెన రిజర్వాయర్‌కు..
- ఆ తర్వాత ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల సందర్శన
హైదరాబాద్, వెలుగు: ‘చలో మేడిగడ్డకు’ బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో, దానికి కౌంటర్ గా ‘చలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సీడబ్ల్యూసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, చిట్టెం పర్నికారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్ శుక్రవారం పాలమూరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. మొదట ఉదయం 11 గంటలకు దేవరకద్ర నియోజకవర్గంలోని కరివెన రిజర్వాయర్ కు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు జడ్చర్ల నియోజకవర్గంలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్ కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కు వెళ్తారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు.
కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు కేసీఆర్తీరని ద్రోహం చేశారని, ఆయన అన్యాయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్ లో మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి వంశీచంద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు చేసిన ద్రోహంపై, పాలమూరుకు చేసిన అన్యాయంపై బహిరంగ చర్చకు కేసీఆర్ రావాలి. కేసీఆర్ దుర్మార్గాలను, నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించేందుకు మేం సిద్ధం. దమ్ము, ధైర్యం ఉంటే.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలి” అని ఆయన సవాల్ విసిరారు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడే రక్షకులు ఎవరో ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారని అన్నారు. మహబూబ్ నగర్ ఓటర్ల తీర్పును రెఫరెండంగా భావిద్దామని, దమ్ముంటే సవాల్‌కు సిద్ధమా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసి, పాలమూరును బీడు పెట్టిన కేసీఆర్ చరిత్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. ‘‘కృష్ణా నీళ్లపై హక్కులను చేతగానితనంతో వదులుకొని, తెలంగాణకు తీరని ద్రోహం చేసిన చరిత్ర కేసీఆర్ ది. తెలంగాణ వాటాగా న్యాయంగా రావాల్సింది 575 టీఎంసీలు అయితే, కేసీఆర్ 299 టీఎంసీలకే కేంద్రం వద్ద అంగీకరించిండు. కృష్ణా నీళ్లలో తెలంగాణ వాటాను తగ్గించుకుంటూ 2016 జూన్ 21 న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ సంతకం పెట్టిండు. తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనం రాసిండు. న్యాయబద్ధమైన వాటాను వదులుకొని.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు కట్టకుండా, పెండింగ్ పనులు పూర్తి చేయకుండా తెలంగాణను బీడుగా మార్చిండు” అని ఆయన అన్నారు.
ఏపీ జలదోపిడీకి కాపలా కాసిండు
‘‘ఎస్ఎల్బీసీ, ఆర్డీఎస్ విస్తరణ, మహబూబ్ నగర్ లోని 10 టీఎంసీల ఎత్తిపోతల పథకాలు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, బీమా లిఫ్ట్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా వదులుకొని, ఏపీ జలదోపిడీకి కేసీఆర్ కాపలా కాశారని మండిపడ్డారు. ‘‘2020 ఆగస్టులో సంగమేశ్వర టెండర్ల ప్రక్రియను ఏపీ పూర్తి చేసేందుకు కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా సహకరించిండు. కేంద్రానికి లేఖ రాసి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించిండు. గత పదేండ్ల కాలంలో కృష్ణా జలాల కోసం ఏపీ 8 ప్రాజెక్టులు, స్కీములు పెడితే, కేసీఆర్ చేసింది మాత్రం గుండుసున్న. కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఒకటి కాదు రెండుసార్లు నాడు కేసీఆర్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 మే 27 న, మళ్లీ 2023 మే 19 న కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ అంగీకారం తెలిపిన మాట వందకు వందశాతం నిజం. మా వద్ద ఆధారాలున్నయ్. శుక్రవారం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనలో అన్ని వివరాలను బయటపెడ్తం” అని ఆయన స్పష్టంచేశారు.
కేసీఆర్.. నమ్మక ద్రోహి
కమీషన్ల కోసం కాళేశ్వరం పేరుతో నకిలీ కట్టడాలను కేసీఆర్ చూపించారని, వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని వంశీచంద్‌రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ సందర్శన పేరుతో బీఆర్ఎస్ చేసే సర్కస్ ఫీట్లను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే, కృష్ణా నీళ్లలో న్యాయమైన వాటా తెలంగాణకు దక్కేదని తెలిపారు. రాజకీయంగా పునర్జన్మనిచ్చిన పాలమూరుకు తీరని ద్రోహం చేసిన నమ్మక ద్రోహి కేసీఆర్ అని ఆయన ఫైర్ అయ్యారు. ‘‘2009 లో పాలమూరులో ఎంపీగా గెలిచేందుకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదు. పదేండ్లు అధికారంలో ఉన్నా మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయని దగుల్బాజీతనం కేసీఆర్ ది. సంగంబండ రిజర్వాయర్‌లో బండ పగలగొడితే 20 వేల ఎకరాలకు నీరు అందుతుందని మొత్తుకున్నా.. ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదు” అని తెలిపారు. సంగంబండ బాధితులకు న్యాయం చేస్తూ, వెనువెంటనే నిధుల విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నామన్నారు. పాలమూరుకు కేసీఆర్ పదేండ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేసి చూపిస్తున్నదని పేర్కొన్నారు. కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పనులు ప్రారంభించి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు కన్నీరు తుడుస్తున్నదని అన్నారు.
