వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించాలె

వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించాలె
  • రిటర్నింగ్ ఆఫీసర్‌‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మాజీ కలెక్టర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై శాసనమండలి రిటర్నింగ్ ఆఫీసర్ ఉపేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి తదితరులు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు కాంగ్రెస్ లీడర్లు. ఐఏఎస్‌గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని మండలి రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు కాంగ్రెస్ నేతలు.

కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి ఫిర్యాదు చేస్తం

వెంకట్రామిరెడ్డిపై కంప్లైంట్ చేసిన అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శాసన మండలి ఎన్నికల్లో కేసీఆర్‌‌ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని, కానీ ఇప్పటి వరకూ పెట్టలేదని అన్నారు. వారి ఆస్తులు, అప్పులు, ఇతర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని, కేసీఆర్ సర్కారు ఈ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాతను తాము పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరితే రిటర్నింగ్ అధికారి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ అంతా టీఆర్‌‌ఎస్‌ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తోందని రేవంత్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌తోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఐఏఎస్‌ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని, ఐఏఎస్‌ రాజీనామాను డీవోపీటీ శాఖ ఆమోదించాలని, సీఎస్‌ ఆమోదిస్తే సరిపోదని రేవంత్ చెప్పారు. కేంద్రం దీనిపై సర్టిఫికెట్ ఇస్తే దానిని నామినేషన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని, దీనిని ఆయన ఫాలో అయ్యారో లేదో చూడాలని అన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంలో డీవోపీటీ మంత్రిత్వ శాఖకు, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇలాంటి వ్యక్తి వల్ల వ్యవస్థ నాశనమైతది

మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి జుగుప్సా కరమైన వ్యక్తి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి ఆయన ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడమేంటని, ప్రభుత్వ అధికారిగా ఉన్న ఆయన టీఆర్‌‌ఎస్ పార్టీ కోసం తన సమయం అంతా పని చేశారని ఆరోపించారు. మన దేశ బ్యూరోక్రాట్ వ్యవస్థకు వెంకట్రామిరెడ్డి మచ్చలాంటి వాడన్నారు. ఇలాంటి వ్యక్తి వల్ల వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉందని భట్టి అన్నారు. ఈ వ్యక్తి రాజీనామా చేసిన వెంటనే నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారని, చీఫ్ సెక్రెటరీ ఏం ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు.