
తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడంలో జగన్-కేసీఆర్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 10 టీఎంసీ నీళ్లను తరలించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టి కుదుర్చుకున్న ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి లు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించేందుకు… ఉత్తర్వులు జారీ చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ ఆయనపై అనేక విమర్శలు చేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్ళు తీసుకెళ్లేందుకు జివో విడుదల చేసినా తెలంగాణ ప్రభుత్వ వైఖరి చెప్పడం లేదన్నారు.
పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీళ్లు తరలిస్తే వికారాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్-నల్గొండ జిల్లాలకు తీవ్రమైన నీటి ఎద్దడి వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడతారని ఎప్పుడు ఊహించలేదని ఆయన అన్నారు. తెలంగాణ ను ఎందుకు తెచ్చుకున్నం అనే ప్రశ్న తలెత్తేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.
కృష్ణ బోర్డు అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ప్రాజక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ప్రాజెక్టుల పై లీగల్ గా వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. గతంలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సర్వే కోసం 7 కోట్లతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మొదటి జివో విడుదల చేసారని చెప్పారు. లక్ష్మీ దేవి పల్లి ప్రాజెక్టు నీళ్లను వికారాబాద్ జిల్లాకు తేవాలని సీఎం కెసిఆర్ ని కోరితే గోదావరి-కృష్ణను అనుసంధానం చేద్దాం అన్నారన్నారు. సీఎం కెసిఆర్ అన్న మాటలు నిజం కాకపోగా.. ఉన్న ప్రాజెక్టులను తగ్గించారన్నారు.
తెలంగాణ సొంత రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అప్పుడు తీవ్రమైన విమర్శలు చేసి, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు కు పెద్ద పొక్కపెట్టింది TRS ప్రభుత్వమేనన్నారు