
మిర్యాలగూడ/దేవరకొండ, వెలుగు : తెలంగాణ రాష్ట్రం భూ కబ్జాలు, నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. ఆధికార పార్టీ నేతలు ప్రజల సొమ్ము దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల, చింతపల్లి మండలం తీదేడులో బుధవారం జరిగిన రచ్చబండలో వారు మాట్లాడారు. ధరణి పోర్టల్ కారణంగా రాష్ర్ట్ంలో భూ సమస్యలు పెరిగాయన్నారు. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని ప్రకటించారు. దామరచర్ల పరిధిలో తండాలకు కరెంట్ సౌకర్యం కల్పించడంతో పాటు, అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ హామీలు అమలు చేయడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకున్న కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ విమర్శించడం సరికాదన్నారు. సమష్టి కృషితో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పనిచేయాలని, అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా రైల్వేలేన్ ఏర్పాటులో భూమి కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించడం లేదని నిర్వాసితులు కాంగ్రెస్‌లీడర్ల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సరైన పరిహారం అందే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ బంటు కిరణ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి, గాలం వెంకన్న, నర్సింహారెడ్డి, గోపాల్, సదానందం, నాగునాయక్, సిద్ధూనాయక్, జీడయ్య యాదవ్ పాల్గొన్నారు.
రచ్చబండలో ఇరువర్గాల రచ్చ
దామరచర్లలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ‘మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారు’ అని శంకర్‌నాయక్ వర్గీయులు అనడంతో స్టేజీపై ఉన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఇరు వర్గాల లీడర్లు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో పార్టీ నేతలు కలుగజేసుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.