- కన్ స్ట్రక్షన్ వర్కర్లకు రూ. 10 వేల చొప్పున పరిహారం
- పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్, డీజిల్
- వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ సర్కారు చర్యలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు కీలక చర్యలను ప్రకటించింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడారు. సర్కారు విధించిన వర్క్ ఫ్రం హోం నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
అయితే, హాస్పిటల్స్, ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ వంటి అత్యవసర సర్వీసులకు మాత్రం వర్క్ ఫ్రం హోం రూల్స్ వర్తించవన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపట్టిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) 3 అండ్ 4 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ఢిల్లీలో నిర్మాణ రంగ పనులను నిషేధించినందున, రిజిస్టర్ అయిన కన్ స్ట్రక్షన్ వర్కర్లకు రూ. 10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు.
ఈ పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామన్నారు. కాగా, పొల్యూషన్ కట్టడిలో భాగంగా ప్రజలు కార్లను షేర్ చేసుకునేందుకు వీలుగా కార్ పూలింగ్ యాప్ ను తీసుకొస్తున్నామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి, పొల్యూషన్ కూడా తగ్గుతుందన్నారు.
అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్(పీయూసీసీ) లేని వాహనాలకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతోపాటు ట్రాఫిక్ రద్దీని బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ మారేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
