విద్యుత్ శాఖలో మూడో డిస్కం... 2 వేల మంది ఉద్యోగులు.. ఆస్తులు, అప్పుల బదలాయింపునకు చర్యలు 

విద్యుత్ శాఖలో మూడో డిస్కం... 2 వేల మంది ఉద్యోగులు.. ఆస్తులు, అప్పుల బదలాయింపునకు చర్యలు 
  • ఏర్పాటుకు విధివిధానాలతో జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం
  • 2026 ఏప్రిల్1 కల్లా ఉనికిలోకి.. 29 లక్షల ఉచిత కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకే 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో మూడో డిస్కం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వలు జారీ చేసింది. అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌లు, మిషన్ భగీరథ, జలమండలి, పట్టణ నీటి సరఫరా కనెక్షన్లను ఈ డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. అన్నీ కలిపి సుమారు 29.08 లక్షల విద్యుత్ కనెక్షన్లను దీనికి బదలాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎన్​పీడీసీఎల్, ఎస్​పీడీసీఎల్ పరిధిలో ఉన్న అప్పులు, ఆస్తులను కూడా బదలాయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కొత్త డిస్కం పరిధిలోకి 2 వేల మంది ఉద్యోగులను నియమించనున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులనే కొత్త డిస్కంలోకి డిప్యూటేషన్​పై పంపించనున్నారు. వ్యవసాయ కనెక్షన్ల మీటర్ రీడింగ్ పక్కాగా తీయడానికి స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

ఈ మేరకు మూడో డిస్కం ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తూ విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం జీవో నెంబర్ 44 జారీ చేశారు. నాలుగు నెలల్లో మూడో డిస్కం సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

మార్గదర్శకాలు జారీ 

రాష్ట్రంలో విద్యుత్ పంపిణీకి సంబంధించి ప్రస్తుతం దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) పని చేస్తున్నాయి. విద్యుత్తు సరఫరా సామర్థ్యాలు పెరిగినా, సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడో డిస్కం ఏర్పాటు అనివార్యమని ప్రభుత్వం భావించింది. దీంతో భారత విద్యుత్తు చట్టం 2003 కింద మూడో డిస్కం ఏర్పాటు చేయనున్నారు. రెగ్యులేటరీ 04 ఆఫ్ 2016 నియమాలకు కట్టుబడి ఈ డిస్కం పని చేస్తుంది. వ్యవసాయ, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు, మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి, పట్టణ నీటి సరఫరా వంటి కనెక్షన్ల బాధ్యతలు తీసుకుంటుంది. రూ.4,929 కోట్ల వ్యవసాయ డీటీఆర్​లు, వాటికి సంబంధించిన ఎల్​టీ విద్యుత్ లైన్ల వంటి ఆస్తులను పాత రెండు డిస్కంల నుంచి బదిలీ చేస్తారు. 

పవర్ కొనుగోలు, పీపీఏ ఒప్పందాలు చేసుకోవచ్చు. దీనికోసం పాత సంస్థల నుంచి వాటా ఇస్తారు. మూడు విద్యుత్​ డిస్కంల విద్యుత్ అవసరాలను సమానంగా పంచుతారు. మూడో డిస్కం నిర్వహణకు 660 మంది ఇంజినీర్లు,1000 మంది సిబ్బంది, 340 మంది అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అవసరం కాగా, టీజీ ట్రాన్స్​కో, జెన్​కో, ఎన్​పీడీసీఎల్, ఎస్​పీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న వారిని బదిలీ చేస్తారు. మీటరింగ్, ఎనర్జీ సెటిల్​మెంట్ కోసం ఎల్టీ డీటీఆర్​ల పైన స్మార్ట్ మీటర్లు అమర్చుతారు. వీటిద్వారా వ్యవసాయ, ఇతర కేటగిరీల కేటాయింపులను ఖచ్చితంగా లెక్కిస్తారు. ఈ స్మార్ట్ మీటర్‌‌‌‌‌‌‌‌లను డీటీఆర్‌‌‌‌‌‌‌‌లకు అమర్చేందుకు రూ.1,306 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇంటర్ఫేస్ మీటర్ల ద్వారా డిస్కంల మధ్య ఎనర్జీ వినియోగం పంచుతారు. 2026, ఏప్రిల్1 నాటికి మూడవ డిస్కం ఆపరేషన్లు ప్రారంభం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. 

మూడో డిస్కం పరిధి.. రాష్ట్రమంతా 

మూడో డిస్కం పరిధి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతున్నది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, మిషన్ భగీరథ వాటర్ సప్లయ్ కోసం కేటాయించిన మీటర్లు, నీటి పారుదల శాఖ పరిధిలో నిర్వహించే లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీమ్​లకు కేటాయించిన మీటర్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ప్రత్యేక డీటీఆర్​లు కలిగిఉన్న మునిసిపాలిటీలలోని మీటర్లు అన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఈ డిస్కంలోకి  మొత్తం 29,08,138 విద్యుత్ కనెక్షన్లు రానుండగా, అందులో 29.05 లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. 

బకాయిల బదిలీ ఇలా.. 

లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి, మిషన్  భగీరథ స్కీంలకు సంబంధించిన బకాయిలను మూడో డిస్కంకు బదిలీ చేయనున్నారు. దీని ద్వారా రూ. 41,239 కోట్లు బకాయిల భారం పాత రెండు డిస్కమ్ ల నుంచి తగ్గిపోతుంది. ఇందులో రూ.22,926 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ బకాయిలు, రూ.7,084 కోట్ల హైదరాబాద్​ జలమండలి బకాయిలు, రూ.5,972 కోట్ల మిషన్​ భగీరథ బకాయిలను మూడో డిస్కంలో చేర్చారు. అలాగే ప్రభుత్వ హామీతో ఉన్న రుణాలను ప్రస్తుత డిస్కమ్‌‌‌‌‌‌‌‌ల నుండి మూడవ డిస్కమ్‌‌‌‌‌‌‌‌కు బదిలీ చేయనున్నారు. వర్కింగ్​ క్యాపిటల్ లోన్​ రూ.55,979 కోట్లు, క్యాపెక్స్​ లోన్​ రూ.6,918 కోట్లు మూడో డిస్కంలో చేర్చారు.

మూడో డిస్కంకు కనెక్షన్ల బదిలీ వివరాలు.. 

వినియోగదారుల వర్గం    టీజీఎస్​పీడీసీఎల్​    టీజీఎన్​పీడీసీఎల్​    ప్రతిపాదిత 3వ డిస్కం 

  • వ్యవసాయం    15,26,876    13,78,903    29,05,779
  • లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు (ఎల్​ఐఎస్​)    192    297    489
  • హైదరాబాద్​ జలమండలి    97    2    99
  • మిషన్ భగీరథ    423    709    1,132
  • డీటీఆర్​ల మున్సిపాలిటీ నీటి కనెక్షన్లు    350    289    639
  • మొత్తం కనెక్షన్లు    15,27,938    13,80,200    29,08,138