శ్రీశైలం ఘ‌ట‌న‌: వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జ‌రిపించాలి

శ్రీశైలం ఘ‌ట‌న‌: వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జ‌రిపించాలి

సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ‌లో కాంగ్రెస్ నాయ‌కులు

హైద‌రాబాద్: శ్రీశైలం ఘటనపై అన్నీ వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయ‌ని.. ప‌వ‌ర్ ప్లాంట్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదానికి సంబంధించి సీఐడీ విచారణలో విశ్వసనీయత లేద‌ని కాంగ్రెస్ నాయ‌కులు అన్నారు. ఈ విష‌యంపై సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి, మల్లు రవి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ లు లేఖ రాశారు. నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఘటన జరిగినట్టు అర్థమవుతోందని, ఉద్యోగుల ఆరోపణలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని లేఖ‌లో పేర్కొన్నారు.

జెన్ కో కేంద్ర కార్యాలయంలో సంతాప సభ పెట్టకపోవడానికి కారణం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అమ్రాబాద్ అడవుల్లో సభ పెట్టుకుని, కన్నీళ్లు పెట్టుకునే దుస్థితికి మీరే కారణ‌మ‌ని సీఎం కు రాసిన లేఖ‌లో తెలిపారు. ఘటన వెనుక నిర్లక్ష్యం, అవినీతి ఉందనడానికి సాంకేతిక ఆధారాలున్నాయని, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి శర్మ ఇదే అనుమానం వ్యక్తం చేశారన్నారు. అగ్ని ప్ర‌మాద సంఘ‌ట‌నను చిన్నదిగా చూపే ప్రయత్నం దుర్మార్గ‌మంటూ… వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ కోరాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు మిమ్మల్ని అనుమానిస్తారని, మీరు స్పందించకుంటే తదుపరి కార్యచరణకు వెళతామ‌ని సీఎం ను ఉద్దేశించి అన్నారు.

ఉద్యోగుల డిమాండ్ మేరకు పరిహారం ఇవ్వాలన్నారు. ఇంటికో ఉద్యోగం, హైదరాబాద్ లో 500 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.