25న బూత్ ఏజెంట్లతో కాంగ్రెస్ మీటింగ్.. హాజరుకానున్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

25న బూత్ ఏజెంట్లతో కాంగ్రెస్ మీటింగ్.. హాజరుకానున్న పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నది. అందులో భాగంగా బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని దాదాపు 44 వేల పోలింగ్ బూత్‌‌‌‌లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో హైకమాండ్ సమీక్ష నిర్వహించనుంది. ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సమీక్ష సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్టు తెలుస్తున్నది.

లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలు, నకిలీ ఓట్ల తొలగింపుపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షి సహా రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను దీపా దాస్ మున్షి పరిశీలించారు. కాగా, ఇప్పటికే 17 లోక్‌‌‌‌సభ స్థానాలకు కో ఆర్డినేటర్లను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది.