- మైనార్టీకి మంత్రి పదవి హైకమాండ్ నిర్ణయమే
 - షేక్‌పేట్ డివిజన్‌లో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తా
 - టోలిచౌక్‌లోని జానకి నగర్‌లో ముస్లిం మైనారిటీ నేతలతో భేటీ
 - జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ మద్దతు
 
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని, అయితే, మెజార్టీని పెంచేందుకు పార్టీ నాయకులు పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, ఇరు పార్టీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడ్డాయన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం టోలిచౌక్‌లోని జానకి నగర్‌లో ముస్లిం మైనారిటీ నేతలతో మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే ఖైసర్ మొయినుద్దీన్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్‌తో కలిసి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం నేతలు మంత్రి వివేక్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్ ముందే చెప్పిందని, హైదరాబాద్‌లో కాంగ్రెస్ చెందిన మైనారిటీ ఎమ్మెల్యే ఎవ్వరూ లేకపోవడంతోనే మంత్రి పదవి ఆలస్యమైందన్నారు.
షేక్‌పేట డివిజన్‌కు తాను ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అనేక సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించానని చెప్పారు. మరికొన్ని సమస్యలను త్వరలోనే శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్‌ను గెలిపించుకుంటే ఒకవైపు మంత్రి అజారుద్దీన్, మరోవైపు నవీన్ యాదవ్‌తో పాటు తాను కూడా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై దృష్టి పెడతామని చెప్పారు.
టీజేఎస్ మద్దతును స్వాగతిస్తున్నం...
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు టీజేఎస్ మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం షేక్‌పేట ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓయూ కాలనీలో మత్రి అజారుద్దీన్, ఎమ్మెల్సీ కోదండరామ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఘనత కోదండరామ్‌కు ఉందన్నారు. కోదండరామ్ మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తమను కలిసి టీజేఎస్ మద్దతు కోరారని, అందులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు.
టీజేఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రచారం చేసి నవీన్ యాదవ్‌కు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరసయ్య, జూబ్లీహిల్స్ ఇన్‌చార్జి హనుమంతు గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు నిజ్జల రమేశ్ ముదిరాజ్, సలీం పాషా, ఆంజనేయులు, దేశపాక శ్రీనివాస్, దారా సత్యం, తుల్జా రెడ్డి, ఆకుల శ్రీనివాస్, హనుమంతు రెడ్డి, జస్వంత్ కుమార్, రవికాంత్, సురేశ్, రసూల్, ఇస్మాయిల్, లక్ష్మణ్, జహీర్, శేఖర్, ఆకుల శ్రీనివాస్, సుధాకర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
షేక్‌పేట్‌లో సీఎం రోడ్ షో ఏర్పాట్లను పరిశీలన..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షేక్‌పేట్, రహమత్ నగర్ డివిజన్లలో నిర్వహించనున్న రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు షేక్‌పేట్‌లోని హనుమాన్ టెంపుల్ వద్ద, 8 గంటలకు రహమత్ నగర్‌లోని శ్రీరామ్ నగర్ క్రాస్ రోడ్డు వద్ద జరగనున్న కార్నర్ మీటింగ్‌లో సీఎం పాల్గొంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సోమవారం రాత్రి మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, ఫహీం ఖురేషీ స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. సభకు రానున్న జనం, ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, నాయకులతో చర్చించారు.
