సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ

సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన పార్టీకి పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం జగ్గారెడ్డి... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లేఖ రాసిన క్షణం నుంచి తాను పార్టీలో లేనన్నారు. సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ చీఫ్ కావొచ్చన్నారు ఎమ్మెల్యే. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరువు కాపాడిన వ్యక్తిని తానే అన్నారు జగ్గారెడ్డి. 

పార్టీ పరువు కాపాడిన నేను కోవర్టా ? అంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కోవర్ట్ అనే ముద్ర వేస్తారా? అంటూ ఆగ్రహంతో మాట్లాడారు. గతంలో కూడా కాంగ్రెస్‌లో వర్గపోరు ఉండేదని.. అయితే అది ఎంతో హుందాగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు పార్టీలో అలాంటి పరిస్థితి లేదన్నారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి చాలా మంది బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. 

జగ్గారెడ్డి రాజీనామా చేస్తే అందుకు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పొసగకపోవడంతో పాటు.. ముక్కుసూటిగా మాట్లాడే తనను కోవర్టుగా చిత్రీకరించారనే మనస్తాపంతోనే జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది. 

ఇవి కూడా చదవండి: 

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

రహదారుల నిర్మాణానికి  కేంద్రం భారీగా  నిధులిచ్చింది