- డిప్యూటీ స్పీకర్, పీఈసీ చైర్ పర్సన్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ పదవులు ఇంకా ఖాళీనే
- నెలలు గడుస్తున్నా బాధ్యతలు తీసుకోని నేతలు
- ఆర్టీసీ, మూసీ, రెడ్కో, బేవరేజెస్, మార్క్‌ఫెడ్ పదవుల వైపు ఎమ్మెల్యేల చూపు
హైదరాబాద్, వెలుగు: మంత్రిపదవులు ఆశించిన పలువురు ఎమ్యెల్యేలకు కీలకమైన బాధ్యతలు ఇచ్చినా వారు సంతృప్తి చెందడంలేదు. పదవులు ప్రకటించి నెలలు గడుస్తున్నా బాధ్యతలు తీసుకోకుండా కెబినెట్ బర్త్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కీలకమైన అనేక కార్పొరేషన్ల పదవులు ఇంకా భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల మీద ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్, కొత్త ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు పదవులు కేటాయించినా వారు తీసుకోకపోవడంతో రెండున్నరేండ్లుగా అవి ఖాళీగా ఉన్నాయి. వద్దన్నవారికి పదవులచ్చి ఖాళీగా ఉంచడం ఎందుకని.. ఆ పదవులు తమకు కేటాయించాలని మొదటిసారి ఎన్నికయిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఆరు నెలల క్రితం డిప్యూటీ స్పీకర్ గా రాంచంద్రు నాయక్ పేరును ప్రకటిస్తే ఆయన ఆ పదవి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.
తనకు మంత్రిపదవి తప్ప మరే పదవి వద్దని ఆయన మొండికేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ లేకుండానే శీతాకాల, వేసవికాల అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా తనకు కేటాయించిన పబ్లిక్ ఎస్టీమేట్ కమిటీ (పీఈసీ) చైర్ పర్సన్ పదవిని స్వీకరించలేదు. ఆమె మంత్రిపదవి గానీ, ఆర్టీసీ చైర్ పర్సన్ పదవి గానీ కోరుతున్నారు. మంత్రిపదవే కావాలన్న పట్టుదలతో ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ పదవిని తీసుకోలేదు.
ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అయినా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేయకపోవడంతో సీనియర్ ఎమ్మెల్యేలు వాటిపై కన్నేశారు. ఆర్టీసీ కార్పొరేషన్, మూసీ రివర్ ఫ్రంట్, రెడ్కో, మార్క్‌ఫెడ్, హాకా, టీఎస్‌ఎంఐడీసీ, టీజీఈడబ్ల్యూఐడీసీ, బేవరేజెస్ కార్పొషన్ వంటి కీలక కార్పొరేషన్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇక మిగిలిన రెండున్నరేళ్లలో అయినా కీలక పదవులు ఇవ్వాలని వారు సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను కోరుతున్నారు
