కాంట్రాక్ట్ ఉద్యోగులను.. రెగ్యూలర్ చేస్తే.. కొత్తగా భర్తీ చేసినట్లా?

కాంట్రాక్ట్ ఉద్యోగులను.. రెగ్యూలర్ చేస్తే.. కొత్తగా భర్తీ చేసినట్లా?

హైదరాబాద్: అబద్ధాలు చెప్పడంలో మంత్రి కేటీఆర్.. కేసీఆర్ ను మించిపోయాడన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 2014 లో అసెంబ్లీ సమావేశాల్లో లక్ష 7 వేల ఉద్యోగాల ఖాళీలున్నాయని సీఎం కేసీఆర్ చెప్పాడని.. మరి కేటీఆర్ లక్ష 31 వేల ఉద్యోగాలు ఎలా భర్తీ చేశాడని ఆయన ప్రశ్నించారు.  విద్యుత్ శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను.. రెగ్యూలర్ చేస్తే.. కొత్తగా భర్తీ చేసినట్లా అని అడిగారు. సింగరేణి క్యాలరీ కంపెనీలో 12500 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కేటీఆర్ చెప్పాడని.. కానీ హెల్త్ సహకరించక వారి పిల్లలను  ఉద్యోగాలలో తీసుకుంటే.. ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేసినట్లేనా అని అన్నారు.

హార్టికల్చర్ విభాగంలో 80 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పిన కేటీఆర్..  ఆ విభాగంలో 440 మంది హార్టికల్చర్ ఎక్సటెన్షన్ ఆఫీసర్ లకు జీతాలు చెల్లించక తొలగించారన్నారు. ఉపాధి హామీ పధకంలో క్షేత్ర స్థాయి అధికారులను తొలగించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.  పాఠశాలల్లో ఊడ్చే స్కావెంజర్ లను కూడా తొలగించడంతో టీచర్ లే ఊడ్చుకుంటున్నారని అన్నారు. యూనివర్సిటీలలో వీసీల భర్తీ చెయ్యలేదని, టీఎస్పీఎస్సి బోర్డు మెంబర్ల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నయన్నారు. తెలంగాణ వస్తే.. బతుకులు మారుతాయని యువకులు పోరాటం చేశారని, కానీ కేసీఆర్ వారి పోరాటాన్ని ఆగం చేసిండని అన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రకటన చేసి రెండున్నర ఏళ్ళు అవుతున్నా.. నిరుద్యోగులకు ఒక్కపైసా కూడా ఇయ్యలేదన్నారు జీవన్ రెడ్డి.