కేటీఆర్.. నీది మేనేజ్ మెంట్ కోటా: ఎంపీ అనిల్ యాదవ్

కేటీఆర్.. నీది మేనేజ్ మెంట్ కోటా: ఎంపీ అనిల్ యాదవ్

హైదరాబాద్, వెలుగు:  మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి లేదని రాజ్యసభ ఎంపీ అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే హైదరాబాద్ లో తిరగనియ్యబోమని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ లో డీసీసీ ప్రెసిడెంట్ రోహన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏండ్లలో కేటీఆర్ ఏం చేసిండో అందరికి తెలుసని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ లీడర్లు మారట్లేదని ఆయన అన్నారు. 2001కు ముందు కేసీఆర్ ఎవరి బూట్లు నాకింది రాష్ట్రం మొత్తానికి తెలుసని.. పిచ్చి మాటలు, పిచ్చి కామెంట్లు చేయెద్దని హెచ్చరించారు. ఎన్నికల్లో 75 నియోజకవర్గాలకు పైగా ప్రచారం చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన పబ్లిక్ లీడర్ రేవంత్ అని ఆయన గుర్తు చేశారు.

 కేటీఆర్ భాష మార్చుకో :  మేడిపల్లి సత్యం

‘‘సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే స్థాయి నీకుందా కేటీఆర్, నీ భాష మార్చుకోకపోతే బట్టలూడదీసి కొడతం” అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర మీదని విమర్శించారు. రేవంత్ పై ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వేలక ఇలా మాట్లాడుతున్నడని అన్నారు. సోమవారం గాంధీ భవన్ సత్యం మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నామరూపం లేకుండా పోతుందని, ఒక్క ఎంపీ స్థానం కూడా బీఆర్ఎస్ గెలవదని, టికెట్ ఇస్తామన్నా పోటీకి ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన అన్నారు.

జూన్ లో మీ దుకాణం బంద్ :  వెడ్మ బొజ్జు పటేల్

ఆరు గ్యారెంటీలు అమలు అవుతుండటం చూసి ఓర్వలేక మతిభ్రమించి సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్​ఆరోపణలు చేస్తుండని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు. సీఎంపై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ అంతా ఖాళీఅవుతుందనే ఆందోళనతోనే విమర్శలలు చేస్తుండని, కేటీఆర్​కు దమ్ముంటే రెండు ఎంపీ సీట్లు  గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. ఎంపీ ఎన్నికల తరువాత జూన్​లో మీ పార్టీ దుకాణం బంద్ ​అవుతుందని అన్నారు.