‘ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవద్దు, డబ్బులు కట్టవద్దు’

‘ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవద్దు, డబ్బులు కట్టవద్దు’

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎల్ఆర్ఎస్ అనే చీక‌టి జీవోను తీసుకువచ్చిందని, కరోనా కష్ట కాలంలో ప్రజల రక్తం పిండుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిప‌డ్డారు. సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టొద్దని సూచించారు. రెగ్యులరైజ్ కోసం ఎవరూ డబ్బులు కట్టవద్దన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఉచితంగా ప్లాట్లను క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు.

ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలని కేసీఆర్,కేటీఆర్ పేపర్ లలో కూడా ప్రచారం చేసుకుంటున్నారని,
30 నుండి 40 సంవత్సరాల లేఔట్ లను కూడా రెగ్యులరైజ్ చేసుకోవాల‌నుకుంటున్నార‌ని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్రభుత్వానికి రూ.3లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. తప్పుడు లేఅవుట్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఎలాంటి పెనాల్టీ లేకుండా ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేయాలని పిటిషన్ వేశామని.. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. న్యాయం కోసం సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని ఎంపీ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.