కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ మూడు ముక్కలే : ఎంపీ కోమటిరెడ్డి

కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ మూడు ముక్కలే : ఎంపీ కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలవుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత మధ్య చీలికలు ఏర్పడతాయని చెప్పారు. అందరికీ పదవులు ఇస్తానని కేసీఆర్ డొక్కు కార్ ఎక్కించుకున్నారని, అది ముక్కలు కావడం ఖాయమన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన ఇంట్లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా తమకే నష్టమని ఆయన కామెంట్ చేశారు. ‘‘కాంగ్రెస్ గెలిచే మిర్యాలగూడ సీటును ఆ పార్టీలు అడుగుతున్నాయి.

లెఫ్ట్ పార్టీ గెలిచే మునుగోడు ఇస్తామంటే కొత్తగూడెం కావాలి అంటున్నారు. అయితే జాతీయస్థాయిలో ప్రయోజనాలు చూసుకుని హైకమాండ్ నిర్ణయం తీసుకుంది” అని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోనే పొన్నాల లక్ష్మయ్యకు గుర్తింపు వచ్చిందని, అలాంటి వాళ్లు పార్టీ వీడడం వల్ల నష్టమేమీ లేదన్నారు. టికెట్ రాదనే ఉద్దేశంతో పీసీసీని, పార్టీని నిందించడం సరికాదన్నారు. పీసీసీని విమర్శించడమంటే హైకమాండ్ పై విమర్శలు చేయడమేనని అన్నారు. తుంగతుర్తి నుంచి కృష్ణవేణి కి టికెట్ దక్కకపోతే, తన నల్గొండ టికెట్ ను ఆమెకు ఇచ్చి గెలిపిస్తానని తెలిపారు. 

70 సీట్లలో గెలుస్తం.. 

వచ్చే ఎన్నికల్లో 70 సీట్లలో గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీ లకు 3 సీట్లు కేటాయించినట్లు చెప్పారు. రాబోయే సెకండ్ లిస్ట్ లోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని, కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే ఇస్తామన్నారు.

‘‘టికెట్లు రానోళ్లు నిరాశ చెందవద్దు. అందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అందుకోసం అందరూ కలసికట్టుగా పని చేయాలి” అని పిలుపునిచ్చారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు. రాష్ట్ర సర్కార్ ఎన్నికల కోడ్ కు ముందు నోటిఫికేన్లు ఇచ్చి, కోడ్ పేరుతో ఎగ్జామ్స్ రద్దు చేస్తోందన్నారు. ఇలా గ్రూప్స్ ఎగ్జామ్స్ రద్దు కావడం వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందన్నారు.