మా బాధలు దేశానికి చెప్పండి .. రాహుల్​ గాంధీకి మణిపూర్​ ప్రజల రిక్వెస్ట్​

మా బాధలు దేశానికి చెప్పండి ..  రాహుల్​ గాంధీకి మణిపూర్​ ప్రజల రిక్వెస్ట్​
  • మూడోసారి మణిపూర్​లో పర్యటించిన కాంగ్రెస్​ ఎంపీ
  • ప్రధాని ఇప్పటికీ రాలేదన్న జనం
  • రెండు రిలీఫ్ క్యాంపులను సందర్శించిన రాహుల్​ గాంధీ

ఇంఫాల్: లోక్​సభ అపోజిషన్ లీడర్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం మణిపూర్​లో పర్యటించారు. జిరిబం, చురచాంద్​పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. అక్కడ తలదాచుకుంటున్న ప్రజలతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం బీరెన్ సింగ్ ఇప్పటి వరకు తమను పరామర్శించలేదని రాహుల్​తో అక్కడి ప్రజలు అన్నారు. ఏడాదిలో మూడు సార్లు వచ్చి సమస్యలడిగి తెలుసుకున్నందుకు రాహుల్​కు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యలపై పార్లమెంట్​లో మాట్లాడాలని కోరారు.

గతేడాది మేలో కుకీ, మైతేయి తెగల మధ్య చెలరేగిన హింస కారణంగా 200 మందికిపైగా చనిపోయారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తమ ఇండ్లు వదిలేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఇటీవల జరిగిన లోక్​సభ ఎన్నికల్లో మణిపూర్​లోని రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కాగా, మణిపూర్​లో అల్లర్లు చెలరేగిన తర్వాత మూడుసార్లు రాహుల్ గాంధీ మణిపూర్​లో పర్యటించారు. అక్కడి ప్రజలతో రాహుల్​కు ఉన్న అనుబంధం అలాంటిదంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాలు తిరుగుతుంటే.. రాహుల్ మాత్రం మణిపూర్ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్లారని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు.

పార్లమెంట్​లో మా ఇబ్బందులు చెప్పండి..

సోమవారం జిరిబం హయ్యార్ సెకండరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును ఆయన సందర్శించారు. ఓ అమ్మాయి రాహుల్​గాంధీతో మాట్లాడింది. ‘‘మణిపూర్​లో ఇంత హింస జరిగినా అటు ప్రధాని కానీ, ఇటు సీఎం కానీ రాలేదు. మా కోసం మీరు మూడుసార్లు వచ్చారు. పార్లమెంట్​లో మా బాధల గురించి చెప్పండి. మా బాధలు దేశానికి తెలియజేయండి’’ అని తెలిపింది. రాహుల్ గాంధీతో తమ బాధలు చెప్పుకుంటూ జిరిబం ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల అవసరాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. జిరిబం నుంచి అస్సాంలోని సిల్చార్ మీదుగా రోడ్డు మార్గంలో ఇంఫాల్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్.. చురాచాంద్​పూర్​ జిల్లా తుయిబాంగ్ గ్రామంలోని రిలీఫ్ క్యాంప్​ను కూడా సందర్శించారు. నిరుడు మే 3న మణిపూర్​లో హింస చెలరేగింది. ఆ టైమ్​లో రాహుల్ గాంధీ మణిపూర్​లో పర్యటించారు.

అస్సాం ప్రజలకు నేనున్న

వరదలతో కొట్టుమిట్టాడుతున్న అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం పర్యటించారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక్కడి ప్రజల తరఫున పార్లమెంట్​లో పోరాడుతానని అన్నారు. అస్సాం ప్రజలకు మద్దతుగా నిలవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కాచార్ జిల్లా ఫులెర్టల్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్​కు వెళ్లి అక్కడున్న వారితో మాట్లాడారు.   వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘పునరావాసాలు, పరిహారం ఇస్తే సరిపోదని, అస్సాంకు వరదల నుంచి పర్మినెంట్ రిలీఫ్ ఇవ్వాలి’ అని రాహుల్ డిమాండ్​ చేశారు. ప్రజలకు కాంగ్రెస్​ అండగా ఉంటుందని చెప్పారు.