దేశ ఆర్మీలో అధికారులు, జవాన్ల కొరత

దేశ ఆర్మీలో అధికారులు, జవాన్ల కొరత

దేశ ఆర్మీలో అధికారులు, జవాన్ల కొరత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్రం అగ్నిపథ్ స్కీం ప్రకటించి, త్రివిధ దళాలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. పార్లమెంట్ లో అగ్నిపథ్ స్కీంపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా లేదన్న ఆయన అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్ ను బలహీన పరుస్తున్నాయని చెప్పారు.

సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారు ?

ప్రస్తుతం దేశానికి రెండు వైపుల నుంచి ముప్పు పొంచి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మీలో లక్షా 16వేల 464 మంది, నేవీలో 13,597 మంది, ఎయిర్ ఫోర్స్ లో 5,723 మంది తక్కువగా ఉన్నారని చెప్పారు. ఆర్మీలో ఏడాదికి 60 వేల మందిని రిక్రూట్ చేసుకోవాల్సివుంటే అగ్నిపథ్ ద్వారా కేవలం 40 వేల మందినే రిక్రూట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆర్మీ అధికారులు మీడియా ముందుకు రావడం దురదృష్టకరమన్నారు.