హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పి, రైతులను రోడ్డున పడేందన్నారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఐకేపీ సెంటర్లలోని ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కనీసం టార్పాలిన్లు, గోదాంల వసతి లేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. హమాలీ పైసలు కూడా రైతుల వద్ద నుంచే వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం రూ. 13 లక్షల కోట్లు ఇచ్చింది
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.13 లక్షల కోట్లు ఇచ్చిందని రాంచందర్ రావు తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్, ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులు కేంద్రం చలవేనని చెప్పారు. వడ్ల కొనుగోలుకు సంబంధించిన నిధులను కూడా కేంద్రమే ఇస్తోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. 12 ఏండ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక కూడా లేదని, విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానించడం కాంగ్రెస్ నాయకుల నైజమని విమర్శించారు.
బీజేపీలో చేరిన ఐఆర్ఎస్ మాజీ అధికారి..
కేంద్ర సర్వీసులో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న ఐఆర్ఎస్, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. హుజూర్‌నగర్, సూర్యాపేట, మఠంపల్లి ప్రాంతాలకు చెందిన మహేశ్వరి, లింగయ్య, నరసింహారావు తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు డాక్టర్బీఆర్.అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి నిర్వహించారు. పార్టీ నేతలు గౌతమ్ రావు, ఎన్వీ.సుభాష్, కుమార్, క్రాంతి కిరణ్, శ్రీలత పాల్గొన్నారు.
