
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, క్రికెటర్ అజారుద్దీన్ పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే ఈ రెండు పేర్లకు ఆమోదం తెలిపినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ కేసీ లేఖను మీడియాకు విడుదల చేశారు.
గతేడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమేర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ ఇద్దరి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. దీంతో ఈ రెండు ఖాళీలను భర్తీ చేసేందుకు మళ్లీ పార్టీ హైకమాండ్ రెండోసారి కోదండరాంకు అవకాశం ఇవ్వగా, అమేర్ స్థానంలో అజార్‌కు చాన్స్ ఇచ్చింది.