- పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయం
- బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం
- ఈసారి వెలమలకు దక్కని ప్రాతినిధ్యం.. ఆ వర్గంలో అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించింది. బడుగు బలహీన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఐదుగురు మహిళలకు కూడా డీసీసీ చీఫ్‌లుగా అవకాశం కల్పించి, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. అదే విధంగా డీసీసీ చీఫ్పోస్టులను కూడా ఏఐసీసీనే నియమించే విధంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. డీసీసీ చీఫ్‌లకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఉండేలా, ఢిల్లీ పెద్దలు నేరుగా జిల్లా నాయకులతో మాట్లాడే విధంగా పార్టీలో సంస్కరణలు తెచ్చింది. అందుకే ఈసారి ఏఐసీసీ ప్రకటించిన డీసీసీ చీఫ్‌ల నియామకాలపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు డీసీసీ చీఫ్‌లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అందులో బీసీలకు 16, ఎస్టీలకు 6, ఎస్సీలకు 5, మైనార్టీలకు 3, ఓసీలకు 6 పోస్టుల చొప్పున కేటాయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్.. పార్టీ పదవుల్లోనూ ఆ వర్గానికి పెద్దపీట వేసింది. ఐదుగురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ ఒకరు, పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురికి డీసీసీ చీఫ్‌లుగా చాన్స్ ఇచ్చింది. ఇలా అన్ని వర్గాలు, అన్ని స్థాయిల నేతలకు బాధ్యతలు అప్పగించి.. అందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది.
వెలమలు నారాజ్..
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఓసీలకు 6 పదవులు కేటాయించినప్పటికీ, వెలమ సామాజిక వర్గానికి మాత్రం ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆ వర్గం అసంతృప్తితో ఉన్నది. పోయినసారి ఐదుగురికి అవకాశం ఇవ్వగా, ఈసారి ఒక్కరికి కూడా చాన్స్ ఇవ్వకపోవడంపై నారాజ్ అయితున్నది. జగిత్యాల జిల్లా అధ్యక్ష పదవిని మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు, పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ నర్సింగరావు ఆశించారు. అలాగే కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కొడుకు, గత ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజేందర్ రావు ప్రయత్నించారు. అయితే వీళ్లద్దరికీ అవకాశం దక్కలేదు. మిగతా జిల్లాల్లోనూ వెలమ సామాజిక వర్గం నేతలు డీసీసీ చీఫ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎవరికీ చాన్స్ రాలేదు.
