
- నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు
- పాల్గొననున్న మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్,
- మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు
- త్వరలో బస్తీ బాట కూడా ప్రారంభం
హైదరాబాద్, వెలుగు:జూబ్లీహిల్స్ లో ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవడంతో నేతలు ప్రచారాన్ని స్పీడప్ చేసే పనిలో ఉన్నారు. మంగళవారం నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్చార్జ్మంత్రులు ప్రచారంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ పరిధిలోలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి రెండు సభలను ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ రెండు సమావేశాలు పార్టీ అంతర్గత సమావేశాలు మాత్రమేనని.. ఇందులో పార్టీ ప్రచారంపై చర్చించి, మరుసటి రోజు నుంచి జనంలో నేతలు పర్యటించనున్నట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ సమావేశాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ఎన్నిక ఇన్చార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు త్వరలో బస్తీ బాట
పీసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ఇన్చార్జ్ మంత్రులు బస్తీబాట ప్రోగ్రాం ప్రారంభించాల్సి ఉంది. కానీ, మారిన షెడ్యూల్ ప్రకారం పార్టీ అంతర్గత సమావేశాలను ఏర్పాటు చేసి పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడంపై దృష్టి పెట్టారు. త్వరలోనే బస్తీ బాట ఉంటుందని పీసీసీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లి.. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తం అయ్యేలా నేతలు బస్తీ బాటకు ప్లాన్ చేశారు.
రానున్న రోజుల్లో ఒకటి, రెండు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి సభలతో పాటు ఆయన రోడ్ షోలు ఉంటాయని పీసీసీ నేతలు అంటున్నారు. అయితే అధికారికంగా ఈ కార్యక్రమాలు త్వరలోనే ఖరారు అవుతాయని పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణాలు, అప్పులపై, కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీ తీరును జనంలో ఎండగట్టడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టనుంది.
ఇదే సమయంలో రేవంత్ సర్కార్ రెండేండ్లలో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల వంటి పేదల పథకాలను ప్రజలకు వివరించడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలవడం, రెండో ఉప ఎన్నిక ఇదే కావడంతో ఇక్కడ కూడా అదే ఫలితం రిపీట్ కానుందని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి.. తమ రెండేండ్ల పాలనకు ఈ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా స్వీకరిస్తామనే ధీమాను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.