రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరం

రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్  దూరం
  • ఆహ్వానాన్ని తిరస్కరించిన అగ్ర నేతలు
  • మతం అనేది వ్యక్తిగత అంశమని జైరాం రమేశ్ కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావొద్దని కాంగ్రెస్‌‌‌‌ అధిష్టానం నిర్ణయించుకుంది. ఆలయ ప్రారంభోత్సవాన్ని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ కార్యక్రమంగా మార్చిందని మండిపడింది. ఈ ప్రోగ్రామ్​ను మోదీ సర్కార్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ ప్రాజెక్టుగా చేసిందని విమర్శలు గుప్పించింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, లోక్​సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరిలకు కేంద్రం ఆహ్వానం పలికింది.

 ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ లీడర్లు ఎవరూ అయోధ్యలో రామ మందిర ఓపెనింగ్ ప్రోగ్రామ్​కు వెళ్లడం లేదు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ తన సొంత పార్టీ ప్రోగ్రామ్​ల నిర్వహిస్తున్నది. అందుకే, ప్రారంభోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’’అని జైరాం రమేశ్ ప్రకటించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసం రామ మందిర్ అంశాన్ని వాడుకుంటున్నాయని విమర్శలు గుప్పించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకుండానే ఎన్నికల్లో లబ్ధి కోసం టెంపుల్ ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. 

మతం అనేది వ్యక్తిగత అంశమని, కానీ.. కొన్నేండ్లుగా బీజేపీ, ఆర్ఎస్​ఎస్​లు అయోధ్యలో రామ మందిరాన్ని పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చాయన్నారు. రామ జన్మభూమి కేసులో 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూనే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్ కోసం పంపిన ఆహ్వానాన్ని అగ్రనేతలు గౌరవప్రదంగా తిరస్కరించారని స్పష్టం చేశారు.