ముంబై: మహిళలు, యువతను ఆకర్షించేలా మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) తన మేనిఫెస్టోను ఆదివారం రిలీజ్ చేసింది. అర్హులైన మహిళలకు మహాలక్ష్మి యోజన కింద నెలకు రూ.3,000 సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అధికారంలోకి వస్తే కుల గణన చేపడ్తామని హామీ ఇచ్చారు. ‘మహారాష్ట్రనామా’ పేరుతో కూటమి మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. ‘‘9 నుంచి 16 ఏండ్ల మధ్య ఉన్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఫ్రీగా అందజేస్తాం. నెలసరి సమయంలో మహిళలకు 2 ఆప్షనల్ లీవ్స్ అందుబాటులోకి తీసుకొస్తం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మహిళలకు నెలకు3 వేలు అందజేస్తాం. బస్సుల్లో ఫ్రీ జర్నీ, ఏడాదికి 6 సిలిండర్లను ఒక్కోటీ రూ.500 లకే అందజేస్తాం’’ అని ఖర్గే హామీ ఇచ్చారు.
పంటలకు మద్దతు ధర
స్వయం సహాయక సంఘాల సాధికారత కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. ‘‘మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘నిర్భయ్ మహారాష్ట్ర’ పాలసీ తీసుకొస్తం. శక్తి చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం. 18 ఏండ్లు నిండిన ఒక్కో యువతికి లక్ష రూపాయలు అందజేస్తాం. రైతులకు మద్దతు ధర లభించేలా చూస్తాం’’ అని ఖర్గే హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. స్కాలర్షిప్ స్కీమ్స్‌ను విస్తరింపజేస్తామన్నారు.
రూ.25 లక్షల ఆరోగ్య బీమా
ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను మరింత పెంచుతామని ఖర్గే ప్రకటించారు. ‘కులగణన అంటే సమాజాన్ని విభజించడం కాదు. వివిధ వర్గాల వారు మరింత ప్రయోజనం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. రూ.25 లక్షల ఆరోగ్య బీమాను మహారాష్ట్రలోనూ అమలు చేస్తాం. రూ.3 లక్షల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే రైతులకు రూ.50 వేలు సాయం చేస్తాం’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ రమేశ్ చెన్నితాల, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, సంజయ్ రౌత్, ఎన్సీపీ సుప్రియా సూలే, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తం
స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మరికొంత మందికి లబ్ధి చేకూరుస్తామని ఖర్గే వివరించారు. సామాజిక న్యాయం కోసం కుల గణన చేపడ్తామన్నారు. ‘‘మహారాష్ట్ర అభివృద్ధికి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. మహా వికాస్ అఘాడీతోనే రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ప్రపంచం అంతా ముంబై వైపు చూస్తున్నది. సామాజిక మార్పు పరంగా దేశంలో మహారాష్ట్ర ముందున్నది. రాష్ట్రంతో పాటు దేశ భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయి. బీజేపీ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదు. మాకు అధికారం ఇస్తే.. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూపిస్తం. కాంగ్రెస్ పాలిత అన్ని రాష్ట్రాల్లో గ్యారంటీలు అమలవుతున్నాయి. హామీల అమలు కోసం కర్నాటక బడ్జెట్లో రూ.52 వేల కోట్లు కేటాయించినం’’ అని ఖర్గే స్పష్టం చేశారు.