చరిత్ర తిరగరాయాలనీ చూస్తున్నారు..నెహ్రూపై రాజ్ నాథ్ సింగ్ ఆరోపణలన్నీ అబద్ధాలే

చరిత్ర తిరగరాయాలనీ చూస్తున్నారు..నెహ్రూపై రాజ్ నాథ్ సింగ్ ఆరోపణలన్నీ అబద్ధాలే

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ప్రభుత్వ నిధులు, ప్రజల సొమ్ముతో మతపరమైన బాబ్రీ మసీదును తిరిగి పునర్నిర్మించాలనుకున్నాడంటూ రాజ్ నాథ్ సింగ్ చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. రాజ్ నాథ్ సింగ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేశారని విమర్శించారు. 

రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్లాట్ ఫాం  X లో ఓ పోస్ట్ చేశారు  మాణికం ఠాగూర్. మతపరమైన నిర్మాణాలకు ప్రభుత్వ డబ్బును వినియోగించడాన్ని జవహర్ లాల్ నెహ్రూ స్పష్టంగా వ్యతిరేకించారని రాశారు. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఎలాంటి ఆర్కైవల్ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. గుజరాత్ లో సోమనాథ్ ఆలయానికి  కూడా ప్రభుత్వనిధుల ద్వారా కాకుండా విరాళాల  ద్వారా జరగాలని నెహ్రు  పట్టుబట్టారని అన్నారు. 

లక్షలాది మంది ఆరాధించే సోమనాథ్ ఆలయాన్నే ప్రజా నిధులను నిరాకంచిన నెహ్రూ.. బాబ్రీ మసీదుకు ఎందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేయాలని ప్రతిపాదిస్తారని ప్రశ్నించారు.  

చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు.. 

రాజకీయ లబ్దికోసం చారిత్రక వాస్తవాలను వక్రీకరించేందుకు  రక్షణ మంత్రి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. రాజ్ నాథ్ సింగ్ ప్రకటనలు చరిత్ర గురించి కాదు.. వర్తమానాన్ని విభజించేందుకు గతాన్ని తిరగరాసే రాజకీయాల గురించి  అని ఠాగూర్ విమర్శించారు. భారత దేశ నిర్మాతలకు అవమానించడం.. దేశ ప్రజలను విడగొట్టేలా కథలు కనిపెట్టడం బీజేపీ వ్యూహమని ఆరోపించారు. నెహ్రూ, పటేల్ వారసత్వాన్ని వక్రీకరించేందుకు మేం ఒప్పుకోం.. సత్యం ముఖ్యం..చరిత్ర ముఖ్యం.. అని ఠాగూర్ అన్నారు. 

రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు?..

మంగళవారం (డిసెంబర్ 2) గుజరాత్ వడోదరలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నిధులను ఉపయోగించి బాబ్రీ మసీద్​ను నిర్మించాలని నెహ్రూ అనుకున్నారని ఆరోపించారు. అయితే దీనిని సర్దార్ వల్లాభాయ్ పటేల్​ అడ్డుకున్నారని తెలిపారు. ఇంకా పటేల్ మరణానంతరం ఆయన స్మారకం కోసం ప్రజలు సేకరించిన నిధులను రోడ్లు, బావుల కోసం వినియోగించాలని నెహ్రూ సూచించినట్లు చెప్పారు. 

ప్రజల సొమ్ముతో అయోధ్యలో బాబ్రీ మసీద్​ను నిర్మించాలని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు. ఈ ప్రతిపాదనను సర్దార్ వల్లాభాయ్ పటేల్​ అడ్డుకున్నారు. దీంతో గుజరాత్​లోని సోమనాథ్​ ఆలయ పునర్​నిర్మాణాన్ని నెహ్రూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పటేల్  ఇందుకోసం ట్రస్టును ఏర్పాటుచేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును తీసుకోకుండా సోమనాథ్​ ఆలయాన్ని పునర్​నిర్మించారని.. అదే విధంగా అయోధ్యలోని రామమందిరాన్ని ప్రభుత్వ నిధుల లేకుండానే మేం నిర్మించాం.. ఆ ఆలయ నిర్మాణానికి అయిన ఖర్చు మొత్తం దేశ ప్రజల నుంచే సేకరించారు. నిజమైన సెక్యూలరిజం అంటే ఇదే అన్నారు రాజ్ నాథ్ సింగ్.  

రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. చరిత్ర తిరగ రాయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.. చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించింది.