ప్రజల కోసం పనిచేయండి... అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు: రాహుల్‌‌గాంధీ

ప్రజల కోసం పనిచేయండి... అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు: రాహుల్‌‌గాంధీ
  • శివుడే మనకు ఆదర్శం.. నిరాడంబరతే మన మూలసిద్ధాంతం 
  • ఆడంబరాలు, అధికార వ్యామోహం బీజేపీ విధానం
  • అహింస, శాంతి, సత్యాన్వేషణ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి
  • మీరు బానిసల్లా బతకొద్దు.. అలాగని అహంకారం పనికిరాదు
  • డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ దిశానిర్దేశం
  • పార్టీ​ సిద్ధాంతాలు, విధానాలపై రెండున్నర గంటల పాటు సెషన్​
  • ట్రంప్‌‌కు మోదీ లొంగిపోయారని కామెంట్‌‌
  • రాహుల్‌‌గాంధీ ప్రధాని పదవి చేపట్టాలి: రేవంత్​
  • ఒక కార్యకర్తగా అడుగుతున్నానని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారని డీసీసీ చీఫ్‌‌లకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌‌ గాంధీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్​ శివుడిలా నిరాడంబరతను కోరుకుంటే.. బీజేపీ మాత్రం ఆడంబరాలకు ప్రాధాన్యమిస్తుందని, ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త శివుడిలా తన పదవిని నిజాయతీగా, నిబద్ధతగా, నిరాడంబరంగా  ప్రజల కోసం వినియోగించాలన్నారు.  ‘‘శివుడు సాధారణంగా ఉంటాడు. ఆయన దగ్గర త్రిశూలం ఉన్నా.. ఆయన వెనకే ఉంటుంది. 

కేవలం ధర్మాన్ని కాపాడాల్సిన సమయంలో మాత్రమే శివుడు ఆ త్రిశూలాన్ని బయటకు తీస్తాడు. చివరికి తనలోని సగ భాగాన్ని స్త్రీకి ఇచ్చి, మిగితా సగ భాగాన్ని కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం కూడా ఇదే’’ అని రాహుల్ చెప్పారు.  అహింస, శాంతి, సత్యాన్వేషణ.. ఈ సిద్ధాంతాల ఆచరణ కోసం నిరంతరం పనిచేయాలని  డీసీసీ చీఫ్‌‌లకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌‌తో కలిసి రాహుల్‌‌గాంధీ ప్రత్యేక విమానంలో  ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్టుకు చేరుకున్నారు.  

అక్కడ సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితోపాటు మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలికిన తర్వాత హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  నేరుగా ఉదయం 10. 30 గంటలకు వికారాబాద్ చేరుకున్నారు. అక్కడ  జరిగిన పీఏసీ ( రాజకీయ వ్యవహారాల కమిటీ ) సమావేశంలో కొద్దిసేపు పాల్గొన్న రాహుల్.. ఆ తర్వాత అనంతగిరిలోని హరిత రిసార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. అక్కడ తెలంగాణ, ఏపీ జిల్లాల డీసీసీ అధ్యక్షులకు గత 10 రోజులుగా సాగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొని రెండున్నర గంటల పాటు వారికి కాంగ్రెస్ , బీజేపీ సిద్ధాంతాలు, విధానాలు, దేశంపై వాటి ప్రభావంపై క్లారిటీ ఇచ్చారు.  

సమానత్వ సిద్ధాంతానికి ప్రయారిటీ.. 

స్వాతంత్ర్య కాలం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్​ పార్టీ దేశంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిని బీజేపీ, మోదీ ఏ రకంగా నిర్వీర్యం చేశారనే విషయాన్ని పవర్​పాయింట్​ ప్రజంటేషన్​ద్వారా రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీ ఉదాహరణలతో వివరించారు. ‘‘ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా కృషిచేయాలి? పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం  చేయాలి? ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి” అనే దానిపై డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దిశా నిర్దేశం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ సమానత్వ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని,  కుల, మత, వర్గ, లింగ భేదాలు.. పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరినీ గౌరవిస్తుందని చెప్పారు. ఈ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీని నడిపించాల్సిన బాధ్యత డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై ఉందన్నారు.  ‘‘కాంగ్రెస్ పార్టీది చెయ్యి గుర్తు.  చేయి అంటే  అభయ ముద్ర. ప్రపంచంలోని అని మతాల చిహ్నం కూడా అభయ ముద్రే. ఇది మన పార్టీ సిద్ధాంతం.  దీనిని ప్రతి కార్యకర్త ఆచరించాలి. పార్టీలో మహిళలకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి”అని సూచించారు. 

 మీరు బానిసలు కాదు.. 

డీసీసీ అధ్యక్షులు బానిసల్లా బతుకొద్దని,  కార్యకర్తలను కూడా ఆ రకంగా చూడొద్దని రాహుల్ సూచించారు. అదే సమయంలో  డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లమనే  అహంకారం కూడా పనికిరాదన్నారు.  ‘‘మీరు నాయకులుగా ఎదిగేందుకు డీసీసీ చీఫ్ పదవే కీలకం.. ఈ పదవిని నిజాయతీగా, నిబద్ధతతో, నిరాడంబరంగా, ప్రజల కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తే భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, సీఎంలుగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు.  

మీరు అలా పనిచేస్తే మీ భవిష్యత్తును నేను చూసుకుంటాను’’  అని భరోసా ఇచ్చారు.  పార్టీకి  కార్యకర్తలు,  ప్రజలు బలం కావాలని, ప్రజలకు పార్టీ  బలంగా నిలవాలన్నారు. ప్రజలతో మమేకమై వారికోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేసేలా మన కార్యాచరణ ఉండాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రధాని మోదీ లొంగిపోయారని, మోదీకి ఉన్న బలహీనతల వల్లే ట్రంప్..ఆయనపై ఆధిపత్యం చలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘ట్రంప్ నేరుగా ఏ దేశంపై యుద్ధానికి తలపడరు.. తన శత్రు దేశంపై దాడికి మరో దేశాన్ని పురిగొల్పుతాడు. 

ఈ మధ్య కాలంలో జరుగుతున్న యుద్ధాలను విశ్లేషించుకుంటే ఇదే విషయం స్పష్టం అవుతుంది’’ అని వివరించారు. భగవాన్, హిందూ అని పదే పదే ప్రశ్నించే బీజేపీ నేతలకు అసలు ఈ పదాలకు అర్థం తెలియదన్నారు.  భగవాన్ అంటే పంచ భూతాలు అని, హిందువులు అంటే  సమాజంలో ఏమీ ఆశించకుండా సేవ చేసే వారని, ఇది ఒక మతం కాదని, కానీ బీజేపీ మాత్రం హిందువులు అనే పేరుతో మత ఉద్రిక్తలను రెచ్చగొట్టి రక్తపాతం సృష్టించాలని చూస్తుందని రాహుల్ ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.  

రాహుల్ ప్రధాని పదవి చేపట్టాలని రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజ్ఞప్తి 

డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరంలో  రాహుల్ మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి ముగింపు ప్రసంగం చేశారు. ఈ దేశం కోసం, భారత ప్రజల కోసం రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు. ‘‘నేను సీఎంగా కాకుండా ఒక సాధారణ కార్యకర్తగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. దేశంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇదే కోరుకుంటున్నారు. రాహుల్ కుటుంబంలో ఆయన తాత, నానమ్మ, తండ్రి ప్రధానులు అయ్యారు. 

రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ పదవిపై వ్యామోహం ఏమాత్రం లేదు.  ఆయన అత్యంత సాధారణ వ్యక్తిలా అందరిలో కలిసిపోతూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ఇవ్వాళ దేశం ఉన్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలి’’ అని రేవంత్ సూచించారు.  రాహుల్ కు ప్రధాని పదవి  అలంకరణ కాదని, ఈ దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని, ప్రధానంగా మోదీపై యుద్ధం చేసేందుకు ఆ దిశగా రాహుల్ గాంధీ సంసిద్ధత వ్యక్తం చేయాలని అభ్యర్థించారు. ఇదే దేశ ప్రజలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తల బలమైన కోరిక అని రేవంత్ స్పష్టం చేశారు.  రేవంత్ ప్రసంగాన్ని విన్న  రాహుల్.. దీనిపై స్పందిస్తూ .. అందుకు తాను సై అన్నట్టు తల ఊపారు.  

బీసీలకే అధిక ప్రాధాన్యత: పీసీసీ చీఫ్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్

తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకంలో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు. డీసీసీ అధ్యక్షులకు 10 రోజులపాటు శిక్షణ ఇవ్వడం, అందులో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొనడం పీసీసీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాహుల్ గాంధీ చూపిన బాటలోనే పార్టీపరంగా బీసీలకు తగిన గుర్తింపును ఇచ్చి న్యాయం చేశామని చెప్పారు. త్వరలోనే అన్ని డీసీసీ కమిటీల నియామకం పూర్తి చేసి.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

ఒక్కో డీసీసీ చీఫ్ కుటుంబ సభ్యులతో మమేకం

శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా డీసీసీ చీఫ్​లు, వారి కుటుంబ సభ్యులతో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ 6  గంటల పాటు గడిపారు. ఇందులో రెండున్నర గంటల పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంత రం మూడున్నర గంటలపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 75 మంది డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వారి కుటుంబ సభ్యులతో మమేకమయ్యారు. వారితో విడివిడిగా ఫొటోలు దిగేందుకు సమయం కేటాయించారు. ప్రతి ఒక్క డీసీసీ చీఫ్​, వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలక రించడంతోపాటు పిల్లలను ప్రేమతో దగ్గరికి తీసుకున్నారు. డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి ముందు వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీఏసీ ( రాజకీయ వ్యవహారాల కమిటీ ) సమావేశం జరిగింది. 

ఇందులో రాహుల్, కేసీ వేణు గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలా, మహేశ్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణా రావు, దామోదర రాజ నర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మాట్లాడారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి పార్టీ సంస్థాగతంగా బలోపేతమవడమే కారణమన్నారు. 

ప్రభుత్వం, పార్టీ కలిసి పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల మానవ వినాశనం జరుగుతున్నదని, ఇలాంటి వాటిని ఆపేందుకు మోదీ గట్టిగా ప్రయ త్నించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. పెద్దగా చర్చ ఏమీ లేకుండానే పీఏసీ సమావేశం ముగిసింది. వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ చేరుకోగానే మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు మంత్రులు, పార్టీ నేతలు స్వాగతం పలికారు. సాయంత్రం 5.30 గంటలకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో ఆయనకు సీఎం రేవంత్, ఇతర నేతలు వీడ్కోలు పలికారు.