నా రాజకీయ వారసులను పార్టీయే ప్రకటిస్తుంది

నా రాజకీయ వారసులను పార్టీయే ప్రకటిస్తుంది

హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎలక్షన్‌‌ ఫలితాలపై స్పందించారు. సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలతోపాటు తన అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా తనను ఆశీర్వదించిన నియోజకర్గ ప్రజలు, ఓటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. తన రాజకీయ వారసులు ఎవరనేది పార్టీయే ప్రకటిస్తుందన్నారు. పార్టీలో కొందరు స్వప్రయోజనాల కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. 

‘జానారెడ్డి అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు. కానీ టీఆర్‌ఎస్ నేతలు ఏడేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలి. లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో, సాగర్‌‌లో ఏమేం చేశారో చెప్పాలి. నాకు 75 ఏళ్ల వయసు వచ్చింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను. పీసీసీ ఎంపికను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఆ విషయంలో నా అభిప్రాయాన్ని పార్టీకి చెబుతా. కరోనా టైంలో కార్యకర్తలను కలవలేకపోతున్నా. కార్యకర్తలను నా వారసులుగా తయారు చేస్తా. ఓటమి బాధ, భయం గానీ అవసరం లేదు. కరోనా పోయాక అందర్నీ కలుస్తా. గెలుపు ఓటములు సహజం. రాజకీయాలకు దూరంగా ఉండడం అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ప్రభుత్వానికి నా అవసరం ఉంటే సలహా సూచనలు ఇస్తా. మా పార్టీకి అవసరం ఉంటే సలహాలు, సూచనలు ఇస్తా’ అని జానారెడ్డి పేర్కొన్నారు.