ఖమ్మం డీసీసీ ఎంపికపై ఉత్కంఠ..ఫైనల్ లిస్టులో ఆ నలుగురు!

ఖమ్మం డీసీసీ ఎంపికపై ఉత్కంఠ..ఫైనల్ లిస్టులో ఆ నలుగురు!
  • రేసులో భట్టి, పొంగులేటి అనుచరులు
  • 56 మంది జాబితాలో ఫైనల్ లిస్టుకు నలుగురు 

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏఐసీసీ పరీశీలకుల సమక్షంలో దరఖాస్తు చేసుకున్న వారిలో జిల్లాకు నలుగురు చొప్పున ఫైనల్ చేసిన లిస్ట్ ఇప్పటికే పార్టీ హైకమాండ్​ వద్దకు చేరింది. బిహార్ ఎలక్షన్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఈ వారంలోనే అధ్యక్షులను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. 

వివిధ పార్టీలు మారి వచ్చిన వారు కాకుండా, మొదటి నుంచి కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్న వారికే పదవులు దక్కుతాయని చెప్పడంతో పాటు, పార్టీలో కనీసం ఐదేండ్ల పాటు సభ్యత్వం ఉండాలని ప్రకటించడంతో 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి దారులు మూసుకుపోయినట్టయింది.

 మరోవైపు జంపింగ్ లకు కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారు మాత్రం పార్టీ తీసుకున్న నిర్ణయంపై సంతోషంగా ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ ను నమ్ముకున్న వారిలో ఎవరికి పదవొచ్చినా ఓకేనని చెబుతున్నారు. 

నలుగురు చొప్పున తుది జాబితా..!

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడంపై ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులు కన్నేశారు. తమకు అవకాశం కల్పించాలంటూ దరఖాస్తుతో పాటు బయోడేటా కాపీని ఏఐసీసీ అబ్జర్వర్ మహేంద్రన్, పీసీసీ కో ఆర్డినేటర్స్ శ్రవణ్ కుమార్ రెడ్డి, రవళిరెడ్డి, రాజీవ్ రెడ్డి, చెక్కిలం రాజేశ్వరరావుకు అందజేశారు. ఖమ్మం జిల్లాలో డీసీసీ పీఠం కోసం 56 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

నిన్న మొన్నటి వరకు జిల్లాలో వేర్వేరు స్థాయిల్లో పార్టీ కోసం పనిచేసినవారు, ప్రజాప్రతినిధులుగా అనుభవం ఉన్న వారు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడ్డ వారు కూడా ఆశావహుల్లో ఉన్నారు. జడ్పీ చైర్మన్ లాంటి పదవులు ఆశించి, రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో నిరాశకు గురైన లీడర్ ఒకరు జిల్లా కాంగ్రెస్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు    చేస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాలో పర్యటించి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. 

అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, ముఖ్యనేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఆశావహులతో ముఖాముఖి మాట్లాడి పార్టీ పటిష్టత కోసం వాళ్ల దగ్గర ఉన్న వ్యూహాలను అడిగి తెలుసుకున్నారు. రెండు వారాల కిందనే ప్రాసెస్ ను కంప్లీట్ చేసి, పార్టీ విధేయత, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆరుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసి హైకమాండ్​ కు అందజేసినట్టు సమాచారం. వారిలో నలుగురు ప్రస్తుతం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఖమ్మం జిల్లాలో ఆశావహులు వీరే..!

ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నవారిలో వైరా నియోజకవర్గానికి చెందిన నూతి సత్యనారాయణ గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ఎన్ఎస్​యూఐ, యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చూశారు. 

మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో పాటు పీసీసీ అధికార ప్రతినిధి, లాయర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన ఈయన గతంలో పాలేరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. వీరితో పాటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన మానుకొండ రాధాకిషోర్ కూడా ఫైనల్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరికి ఈ వారంలోనే బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.

పార్టీ కోసం కష్టపడే వారికివ్వాలి.. 

పార్టీని నమ్ముకొని, పార్టీ కోసమే కష్టపడే వారిని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చే విధంగా పరిశీలకులతో పాటు హైకమాండ్​ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలు కోరుతున్నారు.  దరఖాస్తులు ఇవ్వకున్నా పార్టీలోని నాయకులు, కార్యకర్తలను కో ఆర్డినేషన్ చేసుకునే వారిని గుర్తించి డీసీసీ ఇవ్వాలని పేర్కొంటున్నారు.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇలా..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గాలకు చెందిన నేతలు ప్రధానంగా డీసీసీ పోటీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ సెక్రెటరీ జాన్సన్ అబ్రహం పరిశీలకుడిగా అప్లికేషన్లను స్వీకరించారు. ఆయనతో పాటు టీపీసీసీకి చెందిన అబ్జర్వర్లు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ జహి, ఈడుపుగంటి సుబ్బారావు, ఎ. సంజీవ్ ముదిరాజ్, వైసీ సాగరిక ఆధ్వర్యంలో దరఖాస్తులు తీసుకున్నారు. 

కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు పొదెం వీరయ్యతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, నేతలు కొత్వాల శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, బాలశౌరి, కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాలరావు, చింతలపూడి రాజశేఖర్, దేవీ ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేష్, జూపల్లి రమేష్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరే కాకుండా మరి కొంత మంది ఆశావహులు డీసీసీ పీఠాన్ని దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు.