- ఇందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తీరే నిదర్శనం
- భగీరథ్ మీద పోక్సో కేసు నమోదుపై కాంగ్రెస్ హైకమాండ్ ట్వీట్
న్యూఢిల్లీ, వెలుగు: దోపిడీ, గూండాయిజం, మహిళల గౌరవానికి భంగం కలిగించడమే బీజేపీ నైజం అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ స్వభావమే నిదర్శమని మండిపడింది. భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావిస్తూ.. ఆ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రౌడీ కొడుకు భగీరథ్.. ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తనతో ఒక ఫామ్‌హౌస్‌లో బలవంతంగా మద్యం తాగించి, ఆ తర్వాత లైంగికంగా భగీరథ్ వేధించాడని ఆ బాలిక చెప్పింది. ఆమె ప్రతిఘటించడంతో.. బెదిరించి, దాడి చేశాడు. ఈ విషయంపై మౌనంగా ఉండమని హెచ్చరించాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. బాలిక ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం(పోక్సో) కింద కేసు నమోదు చేశారు’’ అని పోస్ట్‌లో కాంగ్రెస్ పేర్కొంది.
బీజేపీ సభ్యులు అన్ని రకాల తప్పులు చేస్తున్నరు
తండ్రి కేంద్ర మంత్రి కాబట్టి తనను ఎవరూ ఏం చేయలేరని భగీరథ్ చెప్తుంటారని కాంగ్రెస్ ఆరోపించింది. అధికార ఉందనే అహంకారంతో బీజేపీ సభ్యులు అన్ని రకాల తప్పులు చేస్తున్నారని మండిపడింది. మోదీ ఇలాంటి వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారని, వారిని చూసి ఆయన ఎంతో గర్వపడుతున్నారని ఎద్దేవా చేసింది. ప్రధానితో సంజయ్, భగీరథ్‌ల ఫోటోను ట్యాగ్ చేస్తూ, 55 సెకండ్ల నిడివిగల మరో వీడియోను పోస్ట్ చేసింది.
ఇందులో గతంలో భగీరథ్ పార్టీకు హాజరైన ఫొటోలు, వర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి, ఫుల్ జోష్‌లో గ్యాస్ స్ర్పే చేస్తున్న వీడియోలు, కొడుకుతో కలిసి మోదీతో దిగిన ఫొటోలున్నాయి. దీంతో పాటు యూపీ ఉన్నావ్, మధ్య ప్రదేశ్ రేప్ ఘటనలు, అంకిత బండారీపై అఘాయిత్యంలో సంబంధం ఉన్న బీజేపీ నేతల ఫొటోలను కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
