టార్గెట్ హైదరాబాద్.. సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపనున్న కాంగ్రెస్.!

టార్గెట్ హైదరాబాద్.. సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపనున్న కాంగ్రెస్.!
  • సుప్రీంకోర్టు న్యాయవాదిని బరిలోకి దింపనున్న కాంగ్రెస్!
  • గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న హస్తం పార్టీ
  • ముస్లిం అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా విన్నింగ్ చాన్సెస్ పై చర్చ
  • 60% ఓట్లున్న సామాజిక వర్గానికి ఇవ్వడంపై తర్జన భర్జన
  • మైనారిటీ ముద్రకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడవుతుందంటున్న లీడర్లు
  • 1984 తర్వాత ఒక్క సారి కూడా గెలవని ఇతర పార్టీలు 

హైదరాబాద్: హైదరాబాద్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన  చేస్తోంది. 1984 తర్వాత అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎంఐఎం మినహా ఏ పార్టీ గెలవలేదు. మజ్లిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అసుదుద్దీన్ ఓవైసీ ఎంపీగా గెలుపొందుతూ వచ్చారు. దాదాపు 60శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న ఈ పార్లమెంటు స్థానంపై ఇతర పార్టీలేవీ జెండా ఎగురవేయలేక పోయాయి. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలన్న భావనతో ఉందని తెలుస్తోంది. ఇందుకోసం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది షానాజ్ తబస్సుమ్ ను బరిలోకి దింపేందుకు  సిద్ధమవుతోందని సమాచారం. మైనార్టీకి టికెట్ కేటాయించడం ద్వారా ముస్లిం ఓట్లకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడైతే సులభంగా విజయం సాధించవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. షానాజ్ విద్యాధికురాలైన మహిళ కావడంతో మైనార్టీ వర్గానికి చెందిన ప్రగతిశీల భావాలున్న మహిళలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.  హైదరాబాద్ నుంచి బీజేపీ కొంపెల్ల మాధవీలతను రంగంలోకి దింపింది. ఆమెకు టికెట్ కేటాయించడం పట్ల పార్టీలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు మాధవీలత ప్రచారం ప్రారంభించారు. షానాజ్ తబస్సుమ్  ను బరిలోకి దింపడం ద్వారా మహిళా ఓట్లతోపాటు, ఎంఐఎం అప్రతిహత విజయానికి అడ్డుకట్ట వేయడం, తమ పాత ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవడంపై దృష్టి పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. 

ఓవైసీ పోటీ ఇద్దరు మహిళలపైనే?

హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి  బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత బరిలో  నిలువనున్నారు. ఎంఐఎం అభ్యర్థిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ పోటీలో ఉంటారు. కాంగ్రెస్ నుంచి షానాజ్ తబస్సుమ్ పోటీ చేస్తే.. అసదుద్దీన్ పోటీ ఇద్దరు మహిళలపైనే ఉంటుంది. 

ఎవరీ షానాజ్ తబస్సుమ్? 

కాంగ్రెస్ హైదరాబాద్  పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్న షానాజ్ తబస్సుమ్ సుప్రీంకోర్టు న్యాయవాది. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షురాలు కూడా. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను నిర్ణయించేందుకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్ని ఢిల్లీలో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షానాజ్ ప్రస్తావన తెరమీదకు వచ్చింది. ఈమెను బరిలోకి దింపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ALSO READ :- గజ్వేల్ ఆర్డీవో ఆఫీస్ ముందు రైతుల ధర్నా